క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో అమాయక ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ముఠాల లీలలను పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా బట్టబయలు చేశారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, పెద్ద ఎత్తున జరిగే ఫంక్షన్లనే టార్గెట్ చేసుకుని తక్కువ ధరకు మటన్ ఇస్తామంటూ.. కుళ్లిపోయిన, మటన్‌లో బీఫ్ కలిపి అందజేస్తున్నారు. అంతేకాకుండా కుళ్లిపోయిన చేపలు, రొయ్యలు వాసన రాకుండా రసాయనాలు చల్లి మరీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న రెండు వేర్వేరు ముఠాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. పెద్ద ఎత్తున కల్తీ మాంసాన్ని, రసాయనాలు కలిపిన చేపలు, రొయ్యలను సీజ్ చేశారు.
హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో చట్టవిరుద్ధంగా వ్యాపారం సాగిస్తున్న మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి అనే వ్యాపారి అని అధికారులు పట్టుకున్నారు. ఇతడు మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి నగరంలోని పలు పెద్ద పెద్ద హోటళ్లకు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందగా.. పోలీసులు తనిఖీలు చేపట్టారు. హెచ్-ఫాస్ట్ అధికారులు, పోలీసులు ఉమ్మడిగా మల్లేపల్లిలోని సదరు దుకాణంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడు ఉస్మాన్ ఖురేషిని కస్టడీలోకి తీసుకున్నారు. సీజ్ చేసిన ఈ మాంసంలో ఏమేం కలిపారనేది నిర్ధారించడానికి.. శాంపిల్స్‌ను నాచారంలోని ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ లాబొరేటరీ’ కి పరీక్షల నిమిత్తం తరలించినట్లు స్థానిక సీఐ వెల్లడించారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని “తార ఫిషరీస్” అనే దుకాణంపై టాస్క్‌ఫోర్స్, లోకల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.
బేగంబజార్ మార్కెట్ నుంచి అత్యంత తక్కువ ధరకు పాడైపోయిన, కుళ్లిన చేపలు, రొయ్యల నిల్వలను కొనుగోలు చేసి తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కుళ్లిన మాంసం నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేందుకు.. అది ఎప్పటికీ తాజాగా కనిపించేందుకు నిందితులు ప్రమాదకరమైన ‘సోడియం బైకార్బోనేట్ పౌడర్’ను దానికి దట్టించి హోటళ్లకు, కేటరింగ్ ఫంక్షన్లకు తరలిస్తున్నారు. ఈ కేసులో దుకాణ నిర్వాహకులైన శంకర్ సింగ్ (24), మాన్ సింగ్ (32), గులాబ్ సింగ్ (36), రోహిత్ సింగ్ (31) లను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 90 వేల విలువ చేసే 100 కిలోల కుళ్లిన రొయ్యలు, 162 కిలోల పాడైపోయిన చేపలతో పాటు.. దానికి వాడిన 10 కిలోల సోడియం బైకార్బోనేట్ కెమికల్ పౌడర్, 6 బస్తాల ఉప్పును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.