హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన రాజకీయ సమరం మొదలైంది. ఒకప్పుడు రాష్ట్ర గమనాన్ని మార్చిన టీఆర్‌ఎస్ అనే మూడక్షరాల పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడమే కాకుండా, తీవ్ర ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద అభ్యంతరాల సుడిగుండంలో చిక్కుకుంది.భారత రాష్ట్ర సమితి నుంచి గతేడాది సెప్టెంబరు 2న కవిత సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంతంగాఅడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 25న ఆమె అధికారికంగా సరికొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటించారు.
Also Read:New Public Safety Bill: విచారణ లేకుండానే ఏడాది జైలు.. బెంగాల్ ప్రభుత్వం సంచలన చట్టం!
తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ పార్టీ ఆవిర్భవించిందని ఆమె స్పష్టం చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీఐ నిబంధనల ప్రకారం.. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జగృతి, తెలంగాణ ప్రజా శక్తి అనే ఐదు పేర్లను ప్రతిపాదించగా, అందులో ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును పరిశీలనకు తీసుకుంటూ ఏప్రిల్ 30న ఈసీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఈ పార్టీకి సంక్షిప్త నామంగా ‘TRS’ అని నిర్ణయించడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.తెలంగాణ రక్షణ సేన పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ పేరును కవిత పార్టీకి కేటాయించవద్దంటూ దాదాపు 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు ఈసీకి అందినట్లు సమాచారం.
Also Read:LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ.183 తగ్గింపు!
ఈ అభ్యంతరాలలో అత్యధిక భాగం బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య శ్రేణులు, వారి అనుచరుల నుంచే వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ నాయకత్వంలోని ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరును ‘భారత రాష్ట్ర సమితి’ గా మార్చినప్పటికీ, ప్రజల్లో ఇప్పటికీ టీఆర్‌ఎస్ సెంటిమెంట్ బలంగా ఉంది. ఇప్పుడు అదే సంక్షిప్త నామంతో కవిత సరికొత్త పార్టీ పెడితే, భవిష్యత్తులో తమ రాజకీయ మనుగడకు, ఓటు బ్యాంకుకు భారీ గండిపడుతుందనే ఆందోళన భారాస నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈ పేరును ఎలాగైనా అడ్డుకోవాలని వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.మరోవైపు, ఈ అభ్యంతరాలపై కవిత నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రతినిధులు దీటుగానే స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈసీ లేవనెత్తిన పలు ప్రాథమిక అభ్యంతరాలకు తాము లిఖితపూర్వక వివరణ ఇచ్చామని వారు పేర్కొంటున్నారు. మిగిలిన అభ్యంతరాల వివరాలను కూడా తమకు అధికారికంగా పంపితే, వాటికి కూడా చట్టబద్ధమైన సమాధానాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.
Also Read:భారత నావికుడి మృతదేహంలో అవయవాలు మాయం.. వెనెజువెలాలో అసలేం జరిగింది?
ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంతో ఈ విషయమై నిరంతరం ఉత్తరప్రత్యుత్తరాలు సాగుతున్నాయని తెలుస్తోంది. సాంకేతికంగా, చట్టపరంగా తాము సరైన నిబంధనలే పాటించామని కవిత వర్గం చెబుతోంది. త్వరలోనే ఈసీ నుంచి తమకు సానుకూల స్పందన వస్తుందని, ‘తెలంగాణ రక్షణ సేన’ పేరు అధికారికంగా ఖరారవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అభ్యంతరాల తీవ్రత, వాటికి పార్టీ ప్రతినిధులు ఇచ్చే వివరణలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. కవితకు పాత సెంటిమెంట్ కలిసివచ్చి ‘టీఆర్‌ఎస్’ పేరు దక్కుతుందా.. లేక బీఆర్ఎస్ వేసిన బ్రేకులతో ఈసీ కొత్త లింకులు పెడుతుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.