క్రైమ్ మిర్రర్ : బీహార్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో అత్త కంటపడటంతో కోడలు, ఆమె ప్రియుడు కలిసి వృద్ధురాలిని హత్య చేశారు. అనంతరం ఈ నేరాన్ని భూ వివాదం ఉన్న పొరుగువారిపైకి నెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడటంతో నిందితులిద్దరూ కటకటాలపాలయ్యారు.
పూర్నియా జిల్లాలోని నయా నందగోల గ్రామానికి చెందిన 69 ఏళ్ల రామ్లా దేవి నవంబర్ 25న తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన కోడలు గుడ్డి కుమారి గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమె ప్రియుడు రిషి కుమార్తో అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని చూసింది. దీంతో విషయం బయటపడుతుందనే భయంతో కోడలు, ఆమె ప్రియుడు కలిసి చెక్క దుంగతో వృద్ధురాలి తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అనంతరం తమపై అనుమానం రాకుండా ఉండేందుకు కుటుంబంతో భూ వివాదం ఉన్న పొరుగువారిపై నేరాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. రామ్లా దేవి కుమారుడు అబోధ్ పాశ్వాన్ తన తల్లిని పొరుగున నివసించే నితీష్ కుమార్, అతడి తల్లి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తొలుత వారిని అనుమానించి అరెస్ట్ చేశారు.
అయితే ఈ హత్య వెనుక అసలు కారణాన్ని తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో రామ్లా దేవి కోడలు గుడ్డి కుమారి, రిషి కుమార్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ కోణంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
తామే వృద్ధురాలిని హత్య చేసినట్లు గుడ్డి కుమారి, రిషి కుమార్ అంగీకరించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన చెక్క దుంగను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వివరించారు.
also read : విహారయాత్రలో విషాదం.. పుదుచ్చేరి సముద్రంలో తెలంగాణ విద్యార్థి గల్లంతు
