క్రైమ్ మిర్రర్ : గుజరాత్‌లోని వడోదరలో ఉన్న జీఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ల వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ జూనియర్ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన తోటి విద్యార్థి అతడిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న కళాశాల యాజమాన్యం ఐదుగురు సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కళాశాల హాస్టల్‌లో ముగ్గురు జూనియర్ విద్యార్థులు బాణసంచా కాల్చడంపై వివాదం మొదలైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీనియర్లు అర్ధరాత్రి సమయంలో ఆ ముగ్గురినీ ఓ గదికి పిలిపించారు. పరీక్షల సమయంలో టపాసులు కాల్చడంపై వారిని దూషించడంతో పాటు మానసికంగా వేధించినట్లు బాధిత విద్యార్థులు ఆరోపించారు.
సీనియర్ల ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు హాస్టల్ గది నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన మరో విద్యార్థి అతడిని అడ్డుకుని కాపాడాడు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన బాధితులు ర్యాగింగ్‌పై జాతీయ వైద్య కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఫిర్యాదుపై కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు సీనియర్ విద్యార్థులను ఆరు నెలల పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేసింది. ఈ కాలంలో వారు హాస్టల్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే సస్పెన్షన్ కాలంలోనూ వారు కళాశాలలో తమ చదువును కొనసాగించవచ్చని తెలిపింది. బాధిత విద్యార్థులకు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
అయితే ఐదుగురు సీనియర్లపై ఆరు నెలల సస్పెన్షన్ విధించడం మాత్రమే సరిపోదని బాధిత విద్యార్థి అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. వైద్య కళాశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల భద్రత, ర్యాగింగ్ నిరోధక చర్యలపై మరోసారి చర్చకు దారితీసింది.
also read : రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అత్త.. ప్రియుడితో కలిసి హత్య చేసిన కోడలు
