క్రైమ్ మిర్రర్ : జార్ఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రామ్‌గఢ్ జిల్లాలోని రాంచీ-పాట్నా జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉండటం మరింత విషాదకరం.
బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన 14 మంది రాజరప్ప ఆలయ దర్శనం కోసం ఎస్యూవీ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో కుజు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పైంకీ ప్రాంతానికి చేరుకోగానే తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో వాహనం ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు సహా మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తీవ్ర గాయాలు కావడంతో అతడిని రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతకు ఎస్యూవీ వాహనం బాగా దెబ్బతినడంతో అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మృతులంతా బీహార్‌లోని నలంద జిల్లా జంగరో గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆలయ దర్శనం కోసం ఆనందంగా బయలుదేరిన వారిలో 13 మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
also read ; పులివెందులలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి
