క్రైమ్ మిర్రర్ : విహారయాత్ర కోసం పుదుచ్చేరికి వెళ్లిన తెలంగాణ విద్యార్థులకు సముద్రంలో పెను ప్రమాదం ఎదురైంది. సముద్రంలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థులు ఒక్కసారిగా ఎగసిపడిన అలల ధాటికి కొట్టుకుపోయారు. అప్రమత్తమైన స్థానిక లైఫ్ గార్డ్స్ ఆరుగురిని కాపాడగా.. మరో విద్యార్థి సముద్రంలో గల్లంతయ్యాడు.
సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో అలల ఉద్ధృతి పెరగడంతో ఏడుగురు విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ దృశ్యాన్ని గమనించిన అక్కడి లైఫ్ గార్డ్స్ వెంటనే స్పందించారు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మరో విద్యార్థి మాత్రం అలల ప్రవాహంలో కొట్టుకుపోయి కనిపించకుండా పోయాడు.
ప్రమాదానికి గురైన విద్యార్థులంతా తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థి కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. రక్షించిన ఆరుగురు విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. విహారయాత్రలో సరదాగా గడిపేందుకు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
also read : జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది భక్తులు దుర్మరణం
