* ఉద్యమ సమయంలో ఉన్నవారికి ప్రాధాన్యం
* పార్టీ కార్యవర్గాల్లో కీలక మార్పులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా ఎన్నికల్లో ఓటములు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న గడ్డు పరిస్థితులకు ప్రధాన కారణం పార్టీలో పని చేసే వారిని పక్కన పెట్టడమే. గత పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన చాలామందిని నాయకత్వం పక్కన పెట్టింది. దాని ప్రభావం మొన్నటి ఎన్నికల్లో కనిపించింది. పార్టీ అస్తిత్వానికే ఉనికి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాలని బిఆర్ఎస్ నాయకత్వం బలమైన నిర్ణయానికి వచ్చింది.
బంగారు తెలంగాణ అంటూ..
తెలంగాణ వచ్చిన వరకు ఉద్యమ తెలంగాణ అన్న నినాదం ఇచ్చింది గులాబీ పార్టీ. కానీ అధికారంలోకి వచ్చాక బంగారు తెలంగాణ అంటూ కొత్త నినాదం అందుకుంది. ఈ క్రమంలో ఉద్యమ సమయంలో పార్టీకి అండదండగా ఉన్న కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకులను కూడా విస్మరించారు. అయితే ఉద్యమ నాయకులను అణచివేశారన్న విమర్శ మొన్నటి ఎన్నికల్లో గట్టిగానే పని చేసింది. ఇప్పుడు కూడా అదే బలంగా వినిపిస్తోంది. అందుకే గులాబీ పార్టీ నాయకత్వం అప్రమత్తం అయ్యింది. పూర్తిస్థాయిలో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.
సంస్థాగత నిర్మాణం పై ఫోకస్
ఏ రాజకీయ పార్టీ కైనా సంస్థాగత బలం ముఖ్యం. ఇప్పుడు ఆ అవసరం బిఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. అందుకే పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, సభ్యత్వ నమోదు పై ఫుల్ ఫోకస్ చేసింది. జిల్లాస్థాయి నాయకులను రాష్ట్ర కార్యవర్గంలోకి.. మండల స్థాయి నాయకులకు జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చే దిశగా పార్టీ ఆలోచన చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఆపై కవిత వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. పైగా ఆమె దూకుడు అంతా గులాబీ పార్టీ పై ఉండనుంది. వీటన్నింటికీ చెప్పాలంటే బలమైన వ్యవస్థ ఇప్పుడు అవసరం. అందుకే దానిపై దృష్టి పెట్టింది గులాబీ పార్టీ నాయకత్వం. పార్టీ జెండా మోసిన వారితో పాటు నమ్ముకున్న వారికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. వాస్తవానికి బలమైన పునాదులతో ఏర్పడిన పార్టీ తర్వాత బయట పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా ఉద్యమానికి అండగా నిలిచిన వారి విషయంలో ఏకపక్షంగా వ్యవహరించింది బిఆర్ఎస్. దానికి మూల్యం చెల్లించుకుంది కూడా. అందుకే ప్రక్షాళన అనివార్యంగా తేలింది.
ఆ ముద్రను చెరిపే ప్రయత్నం..
రాజకీయ ప్రత్యర్థులు బిఆర్ఎస్ పై కుటుంబ పార్టీగా ముద్రవేశారు. ఆపై అవినీతి ఆరోపణలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని ప్రక్షాళన చేయకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని నాయకత్వానికి తెలుసు. దీనిని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవుల పంపకం జరగనున్నట్లు సమాచారం.. పార్టీ అనుబంధ రంగాల విస్తరణ, సభ్యత్వ నమోదు తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా పనిచేసిన వారిని కొనసాగించి.. పనిచేయని వారిని పార్టీ కార్యవర్గాల నుంచి తప్పించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే గులాబీ పార్టీ వాస్తవాలను గుర్తిస్తుండడం విశేషం.
