Homeక్రైమ్నకిలీ విద్యార్హత పత్రాలతో ఉద్యోగాలు.. 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు

నకిలీ విద్యార్హత పత్రాలతో ఉద్యోగాలు.. 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు

తెలంగాణలో నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు నిర్ధారణ కావడంతో 35 మంది ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది. సంబంధిత విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వెరిఫికేషన్ నివేదికల్లో సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని తేలడంతో వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తొలుత కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహించిన పలువురు లెక్చరర్లను ప్రభుత్వం 2023లో రెగ్యులరైజ్ చేసింది. అయితే, వారి విద్యార్హతలకు సంబంధించిన పత్రాలపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఇంటర్మీడియట్ విద్యాశాఖ వాటిని సంబంధిత యూనివర్సిటీలకు పంపించి పరిశీలన చేయించింది.

విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన నివేదికల్లో సదరు సర్టిఫికెట్లు నకిలీవని నిర్ధారణ కావడంతో శాఖ అధికారులు సంబంధిత లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారి నుంచి వివరణలు స్వీకరించిన అనంతరం, ఆరోపణలు నిర్ధారణ కావడంతో 35 మందిని విధుల నుంచి తొలగించారు.

ఏ జిల్లాల్లో ఎక్కువ మంది?

తొలగింపునకు గురైన లెక్చరర్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా ఆరుగురు ఉన్నారు. పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల నుంచి ముగ్గురేసి చొప్పున ఉన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున లెక్చరర్లు ఉన్నారు. మరో ఎనిమిది జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

మరింత మందిపై అనుమానాలు

నకిలీ విద్యార్హత పత్రాలకు సంబంధించి గతంలోనూ దాదాపు 10 మంది లెక్చరర్లను సర్వీస్ నుంచి తొలగించినట్లు సమాచారం. తాజాగా మరో 320 మంది జూనియర్ లెక్చరర్ల విద్యార్హత సర్టిఫికెట్లను కూడా సంబంధిత విశ్వవిద్యాలయాలకు వెరిఫికేషన్ కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో మరింత మంది ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

సీబీ-సీఐడీ, విజిలెన్స్ విచారణకు డిమాండ్

ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఛైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీ-సీఐడీతో పాటు విజిలెన్స్ విభాగం ద్వారా విచారణ జరిపించాలని కోరారు.

నకిలీ పత్రాలను గతంలో పరిశీలించి, ధ్రువీకరించిన అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని ఆయన సూచించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు పూర్తిగా నిర్ధారణ అయితే, సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.

also read: “బిగ్ బాస్” ఫేమ్ అర్చనా గౌతమ్ కేఫ్‌లో చోరీ.. క్యాష్ కౌంటర్‌నే ఎత్తుకెళ్లిన దొంగ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు