•కొడాలి వారసుడి ప్రకటనపై సీనియర్ల ఫిర్యాదు
•అధినేత ఆగ్రహం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- మాజీ మంత్రి కొడాలి నాని వారసుడుని ప్రకటించారు. తన సోదరుడు కుమారుడు అర్జున్ ను వారసుడిగా ప్రకటించేశారు. ఈ విషయాన్ని కొడాలి నాని సమక్షంలోనే ప్రకటించారు మాజీ మంత్రి పేర్ని నాని. దీనిపై అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కొంతమంది పార్టీ సీనియర్ల ఫిర్యాదుతో అధినేతలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు తెలుస్తోంది. గుడివాడలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు మాజీమంత్రి పేర్ని నాని. పనిలో పనిగా కొడాలి నాని వారసుడు అర్జున్ అంటూ ప్రకటన చేశారు. 2029లో కొడాలి నాని పోటీ చేస్తారని.. 2034లో మాత్రం అర్జున్ పోటీ చేస్తారని ప్రత్యేక ప్రకటన చేశారు. దీనిపైనే అధినేత జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
చివరి వరకు సస్పెన్స్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చివరి వరకు టికెట్లు ఖరారు చేసే ఛాన్స్ లేదు. అటువంటిది మూడు సంవత్సరాలు ముందుగానే పేర్ని నాని ఎలా ప్రకటిస్తారు అనేది సీనియర్ల నుంచి వచ్చిన మాట. దీనిపై అధినేత జగన్మోహన్ రెడ్డికి సీనియర్లు ఫిర్యాదు చేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో సీనియర్లు చాలామంది వారసులకు చాన్స్ ఇవ్వలేదు జగన్. కానీ పేర్ని నానికి మాత్రం ఆ అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు అదే స్వేచ్ఛతో ప్రకటనలు చేస్తున్నారు పేర్ని నాని. దీనిపై సీనియర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీనియర్లకు మొండి చేయి..
మొన్నటి ఎన్నికల్లో ధర్మాన సోదరులతో పాటు తమ్మినేని సీతారాం లాంటి నేతలు తమ వారసులను రంగంలోకి దించాలని చూశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అందుకు అంగీకరించలేదు. సీనియర్లుగా మీరు పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అదే సమయంలో పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారికి మినహాయింపు ఇచ్చారు. అప్పటికే సీనియర్లు అసంతృప్తి చెందారు. అయితే ఇప్పుడు ఏకపక్షంగా పేర్ని నాని కొడాలి నాని వారసుడిని ప్రకటించడానికి తప్పుపడుతూ అధినేతకు ఫిర్యాదు చేశారు. గత రెండేళ్లుగా కొడాలి నాని గుడివాడలో అందుబాటులో లేరు. అటువంటి చోట నేరుగా వారసుడిని ప్రకటించడం ఏమిటి అనేది సీనియర్ల నుంచి వస్తున్న ప్రశ్న. దీంతో జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పేర్ని నానికి గట్టిగానే క్లాసు పీకినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.