•చంద్రబాబుకు రిక్వెస్ట్
•విజయవాడ ఎంపీ సీటు ఇస్తే పార్టీలోకి రీ ఎంట్రీ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని టిడిపిలో చేరుతారా? చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారా? తిరిగి పార్టీలో చేరేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2024 ఎన్నికలకు ముందు వరకు ఆయన టిడిపిలోనే ఉన్నారు. కానీ అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనవసరంగా టిడిపికి గుడ్ బై చెప్పానన్న బాధతో క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో తిరిగి టిడిపిలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ట్రేవెల్స్ వ్యాపారంలో దిగ్గజం
కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారంలో దిగ్గజం. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీలో చేరి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటమి ఎదురైంది. చంద్రబాబు పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో రెండోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ తరుణంలో విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలోని టిడిపి నేతలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఎంతలో టిడిపి నాయకత్వం ఆయన సోదరుడు చిన్నికి ప్రోత్సాహం అందించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన టిడిపికి గుడ్ బై చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే టిడిపి నాయకత్వం నాని సోదరుడు చిన్నికి టిడిపి టికెట్ ఇచ్చింది. దీంతో సోదరుడు చిన్ని చేతిలో ఓడిపోయారు నాని. మనస్థాపానికి గురైన నాని రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఆ బాధతోనే..
అయితే రాజకీయాల నుంచి దూరమైన నాని తెలుగుదేశం పార్టీని అనవసరంగా వదిలేసానని మాత్రం బాధపడుతున్నారు. పైగా పది సంవత్సరాలపాటు విజయవాడ పార్లమెంటు పరిధిలో మంచి ముద్ర చాటుకున్నారు. అయితే ఆయన విషయంలో టిడిపి నాయకత్వానికి కూడా మంచి అభిప్రాయం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు విషయంలో చాలా విధేయతతో ఉండేవారు. చంద్రబాబు సైతం కేశినేని నాని విషయంలో చాలా గౌరవభావంతోనే చూసుకునేవారు. అందుకే ఇప్పుడు నాని టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు తన కుమార్తెకు విజయవాడ మేయర్ సిటు ఇస్తే టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు దీనిపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ చంద్రబాబు అనుమతి ఇస్తే కేసినేని నాని టిడిపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.