క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత విద్యాశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేసిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కొద్దిరోజులు నుంచి కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై తాజాగా వైసీపీ కూడా పోరుబాట పట్టింది. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎస్సీ అభ్యర్థులతో జగన్ సమావేశాన్ని కూడా నిర్వహించారు.ఈ సమావేశంలో పలువురు అభ్యర్థులు తమకు ఎలా అన్యాయం జరిగిందో వివరించారు. దీనిపై స్పందించిన జగన్ పార్టీ తరపున అండగా ఉండడంతోపాటు బాధితులకు న్యాయం సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా డీఎస్సీలో బాధితులకు అండగా ఉండేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించారు. ఈ కమిటీ డీఎస్సీ అక్రమాలపై పోరాటం చేస్తున్న అభ్యర్థులకు అండగా ఉంటుంది. ఈ కమిటీ డీఎస్సీ అక్రమాలపై పోరాటం చేస్తున్న అభ్యర్థులకు అండగా నిలుస్తుందని వైసీపీ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి, తమకు అన్యాయం చేశారని వాపోతున్న అభ్యర్థులకు ఈ కమిటీ అండగా ఉంటుందని పేర్కొంది.
రెండు కమిటీలు ఏర్పాటు
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో డీఎస్సీ అభ్యర్థుల పోరాటానికి అండగా ఉండేందుకు రెండు కమటీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి డీఎస్సీ పోరాట కమిటీ కాగా, మరొకటి న్యాయ పోరాటం కోసం లీగల్ సెల్‌ను ఏర్పాటు చేశారు. డీఎస్సీ పోరాట కమిటీలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తమడం కల్పలతతోపాటు వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్థి విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవించద్ర ఉన్నారు. అలాగే, లీగల్‌సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన లీగల్ సెల్‌లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మలసాని మనోహర్ రెడ్డి, చల్లా సుదర్శన్ రెడ్డి, ఎస్‌జీపీఎస్ కిశోర్ ఉన్నారు. వీరంతా డీఎస్సీ అభ్యర్థులకు అవసరమైన సహకారాన్ని అందించడంతోపాటు క్షేత్రస్తాయిలో పోరాటాన్ని చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ డీఎస్సీ అక్రమాలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. రానున్న రోజుల్లో దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.