భారతీయ ఉద్యోగ సంస్కృతిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఉద్యోగులు కార్యాలయంలో ఎంతసేపు కూర్చుంటున్నారు అనే అంశాన్నే పనితీరుకు ప్రమాణంగా చూడటం ఎంతవరకు సరైనదన్న ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది. ఈ చర్చకు కారణం నిష్ఠా త్రిపాఠి అనే మహిళ చేసిన సోషల్ మీడియా పోస్టు. ఆమె వెల్లడించిన అభిప్రాయాలు ప్రస్తుతం లక్షలాది మంది ఉద్యోగుల అనుభవాలకు ప్రతిబింబంగా మారాయి. ముఖ్యంగా సకాలంలో కార్యాలయం నుంచి వెళ్లిపోతే ఉద్యోగిని బాధ్యతలేని వ్యక్తిగా చూడటం భారతీయ కార్యాలయాల్లో సాధారణంగా మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“భారతదేశంలో సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుంచి బయటకు రావాలంటే కూడా అపరాధ భావన కలుగుతోంది. ఉదయం 7 గంటలకే వచ్చి రోజు మొత్తం కష్టపడి పని చేసినా, సమయానికి లాగ్ ఆఫ్ చేస్తే చాలు ‘ఈ రోజు హాఫ్ డేనా?’ అంటూ వెటకారంగా మాట్లాడుతుంటారు” అని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగి పనితీరు, సామర్థ్యాన్ని పక్కనపెట్టి కార్యాలయంలో ఎక్కువసేపు కనిపించడాన్నే నిబద్ధతగా భావించడం విచారకరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విధమైన సంస్కృతి ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని కూడా ఆమె హెచ్చరించారు.
యూరప్ దేశాల్లోని పని విధానాన్ని భారత్‌తో పోల్చుతూ నిష్ఠా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ సంస్థల్లో ఉద్యోగులు సాయంత్రం 5 గంటలు కాగానే ఎటువంటి ఒత్తిడి లేకుండా కార్యాలయం నుంచి వెళ్లిపోతారని, అందుకు ఎలాంటి వివరణలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఆమె చెప్పారు. అయినప్పటికీ అక్కడ పనులు సమయానికి పూర్తవుతాయని గుర్తుచేశారు. కానీ భారత్‌లోని బహుళజాతి సంస్థల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అమెరికా, ఐరోపా సమయాలకు అనుగుణంగా సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల భారతీయ ఉద్యోగులు రాత్రి వరకు పనిచేయాల్సిన పరిస్థితి వస్తోందని తెలిపారు. రాత్రి 10 గంటలైనా భారతీయ ఉద్యోగి అందుబాటులో ఉంటాడనే అభిప్రాయం కార్యాలయాల్లో బలపడిపోయిందని ఆమె విమర్శించారు.
విదేశాల్లో పనిచేసి తిరిగి భారత్‌కు వచ్చే వృత్తినిపుణులకు ఇక్కడి పని వాతావరణం మరింత ఒత్తిడిగా అనిపిస్తోందని నిష్ఠా త్రిపాఠి అభిప్రాయపడ్డారు. ఉద్యోగులపై సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షణ, వ్యక్తిగత సమయానికి విలువ ఇవ్వకపోవడం, ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే అంచనాలు పెరగడం వంటి అంశాలు ఉద్యోగులను మానసికంగా అలసటకు గురిచేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే వారి శక్తిని గౌరవించాల్సిందే కానీ, నిరంతరం పని చేయడాన్నే గొప్పగా చూపించే హస్టిల్ కల్చర్‌ను ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని ఆమె స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. కార్యాలయంలో ఎక్కువసేపు కనిపించడాన్నే నిబద్ధతగా భావించే ‘ప్రెజెంటీయిజం’ సంస్కృతి ఉద్యోగుల సృజనాత్మకతను దెబ్బతీస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమర్థతను బద్దకంగా చూడటం వల్ల ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. విదేశాల్లో పని గంటలకు ఇచ్చే గౌరవం వల్ల అక్కడి ఉత్పాదకత తగ్గకుండా మరింత పెరుగుతోందని మరికొందరు గుర్తుచేస్తున్నారు.
అయితే ఈ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించడం లేదు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఎక్కువ పని గంటలు సహజమేనని కొందరు వాదిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒక దశలో కఠినమైన పని సంస్కృతినే అనుసరించాయని వారు గుర్తుచేస్తున్నారు. భారతీయ ఉద్యోగుల జీవనశైలి, పని సమయాలు పాశ్చాత్య దేశాల కంటే భిన్నంగా ఉంటాయని, అందువల్ల రెండింటిని ఒకే కోణంలో పోల్చడం సరైన పద్ధతి కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఉద్యోగి శక్తి, ఉత్పాదకత, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే పని సంస్కృతి అవసరమనే చర్చ మాత్రం ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది.
ALSO READ: ‘వయసు’ అసలు పాయింట్!