HomeజాతీయంSupreme Court: గృహిణులే దేశ నిర్మాతలు.. వారి సేవల విలువ నెలకు రూ.30 వేల కంటే...

Supreme Court: గృహిణులే దేశ నిర్మాతలు.. వారి సేవల విలువ నెలకు రూ.30 వేల కంటే ఎక్కువే!

గృహిణుల కృషిని తక్కువగా అంచనా వేయకూడదని, వారిని దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములుగా గుర్తించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంటి పనులు చేసే మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా పరోక్షంగా ఎంతో సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఒక గృహిణి అందించే సేవలకు ఆర్థిక విలువ కట్టాల్సి వస్తే కనీసం నెలకు రూ.30 వేలుగా పరిగణించాలని కోర్టు అభిప్రాయపడింది.

రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయిన వ్యక్తి కేసు విచారణ

రోడ్డు ప్రమాదంలో తన భార్యను కోల్పోయిన వ్యక్తి నష్టపరిహారం పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశంపై విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌ ల ధర్మాసనం కేసును పరిశీలించింది. ఈ సందర్భంగా గృహిణుల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో సాధారణంగా గృహిణులు కుటుంబంలో సంపాదించే వ్యక్తులపై ఆధారపడి జీవిస్తారని భావిస్తారని, కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నమని కోర్టు పేర్కొంది. ఒక కుటుంబం సక్రమంగా నడవడంలో గృహిణి పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపింది. ఇంటి నిర్వహణ, పిల్లల సంరక్షణ, కుటుంబ సభ్యుల అవసరాలపై శ్రద్ధ పెట్టడం వంటి అనేక బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేసింది. జీతం లేకుండా మహిళలు చేసే ఈ సేవలు దేశ జీడీపీలో గణనీయమైన వాటాకు సమానమని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

కేసు వివరాల్లోకి వెళ్తే, పంజాబ్‌కు చెందిన ఒక మహిళ 2001లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె భర్త, ముగ్గురు పిల్లలు నష్టపరిహారం కోసం మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించారు. మొదట ట్రైబ్యునల్ రూ.2.42 లక్షల పరిహారం మంజూరు చేసింది. అనంతరం బాధితులు పంజాబ్-హరియాణ హైకోర్టును ఆశ్రయించగా, పరిహారం మొత్తాన్ని రూ.8.43 లక్షలకు పెంచింది. అయితే, ఈ మొత్తం కూడా తగినది కాదని భావించిన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, గృహిణుల సేవలకు తగిన ఆర్థిక విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నష్టపరిహారం లెక్కించే సమయంలో గృహిణి అందించే గృహ సంరక్షణ సేవలను కనీసం నెలకు రూ.30 వేలుగా పరిగణించాలని ఆదేశించింది. ఈ తీర్పు గృహిణుల కృషికి మరింత గుర్తింపు తీసుకువచ్చే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు