క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్, దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, మాజీ మంత్రి గోమతి సహా పలువురు నేతలు శనివారం టీవీకే పార్టీలో చేరారు. పనయూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, నేత ఆదవ్ అర్జున సమక్షంలో వీరు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. దాదాపు 2500 మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీవీకేలో చేరేందుకు రావడంతో పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఒక్కొక్కరికి పార్టీ కండువా కప్పి నాయకత్వం వారిని పార్టీలోకి ఆహ్వానించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆదవ్ అర్జున, ఇతర పార్టీలలో సీనియర్ నేతలకు సరైన గౌరవం లభించకపోవడం వల్లే టీవీకే వైపు నాయకులు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ప్రజల మద్దతు ఉన్నందునే వివిధ పార్టీలకు చెందిన నేతలు స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ చేరికలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు మన్సూర్ అలీఖాన్‌దే. గతంలో విజయ్, త్రిష కలిసి నటించిన లియో సినిమా విడుదలైన తర్వాత త్రిష గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలను సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్రంగా ఖండించగా, విషయం కోర్టు వరకు వెళ్లింది.
అనంతరం మన్సూర్ అలీఖాన్ క్షమాపణలు కూడా తెలిపారు. ఇప్పుడు అదే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో మన్సూర్ అలీఖాన్ చేరడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. పార్టీలో చేరిన అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తుకు విజయ్ నాయకత్వం అవసరమని, ఆయనకు అండగా నిలవడం తన లక్ష్యమని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మంచి ఫలితాలు సాధించగా, మన్సూర్ అలీఖాన్ పోటీ చేసిన స్థానం నుంచి విజయం సాధించలేకపోయారు.
ఎన్నికలు ముగిసి కొద్ది కాలమే అయినప్పటికీ ఆయన టీవీకేలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత వివాదాల నేపథ్యంలో మన్సూర్ అలీఖాన్ చేరికపై సినీ అభిమానులు, ముఖ్యంగా త్రిష అభిమానులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ పరిణామంపై త్రిష స్పందన ఏమైనా ఉంటుందా అనే అంశం కూడా తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.