ప్రకృతిలో సంభవించే మార్పులను మనుషులు గుర్తించేలోపే కొన్ని జంతువులు వాటిని ముందుగానే పసిగడతాయి. ప్రకృతి విపత్తులు సంభవించే ముందు వాతావరణంలో, భూమిలో, నీటిలో జరిగే సూక్ష్మ మార్పులను అవి తమ ప్రత్యేక ఇంద్రియాల ద్వారా గుర్తించి అప్రమత్తమవుతాయి. శాస్త్రవేత్తలు కూడా అనేక సందర్భాల్లో జంతువుల ప్రవర్తనను పరిశీలించి ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. తుఫానులు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి విపత్తులు సంభవించే ముందు జంతువుల ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రకృతితో అనుసంధానమై జీవించే ఈ జీవులు పర్యావరణంలో చోటుచేసుకునే చిన్నపాటి మార్పులను కూడా ప్రమాద సంకేతాలుగా భావించి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి.
ఏనుగులు ప్రకృతి హెచ్చరికలను ముందుగా పసిగట్టే జంతువులలో ప్రధానమైనవి. ఇవి తమ తొండాలు, పాదాల ద్వారా భూమి లోపలి నుంచి వచ్చే అత్యల్ప పౌనఃపున్య ధ్వనులను గుర్తించగలవు. వీటిని ఇన్‌ఫ్రాసౌండ్ తరంగాలు అంటారు. ఈ తరంగాల సహాయంతో వందల మైళ్ల దూరంలో ఏర్పడే తుఫానులు లేదా సునామీలను కూడా ఏనుగులు ముందుగానే అంచనా వేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఇవి ఎత్తైన ప్రాంతాలకు తరలిపోతూ తమ గుంపును కూడా అప్రమత్తం చేస్తాయి. 2004లో సంభవించిన హిందూ మహాసముద్ర సునామీ సమయంలో అనేక అడవి జంతువులు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
పాములు, ఎలుకలు కూడా భూకంపాల ముందు అసాధారణంగా ప్రవర్తించే జీవులుగా గుర్తింపు పొందాయి. భూమిలో ఏర్పడే స్వల్ప ప్రకంపనలను ఇవి చాలా సున్నితంగా గుర్తిస్తాయి. భూకంపం సంభవించే కొన్ని రోజుల ముందే పాములు తమ బొరియల నుంచి బయటకు రావడం, ఎలుకలు అకస్మాత్తుగా గుంపులుగా పారిపోవడం వంటి ఘటనలు అనేక ప్రాంతాల్లో నమోదయ్యాయి. నిర్మాణాలు కూలిపోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అవి అప్రమత్తంగా ప్రవర్తిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. భూమి లోపలి టెక్టోనిక్ కదలికల వల్ల ఏర్పడే కంపనాలు, విద్యుత్ మార్పులను ఈ జీవులు గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంటాయని భావిస్తున్నారు.
వలస పక్షులు కూడా ప్రకృతి మార్పులను ముందే గుర్తించగలవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తుఫానులు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాలకు ముందు ఏర్పడే ఇన్‌ఫ్రాసౌండ్ తరంగాలను ఇవి గ్రహిస్తాయి. అందుకే ప్రమాదం సంభవించే ప్రాంతాలను వదిలి ముందుగానే దూర ప్రాంతాలకు ఎగిరిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక సముద్ర జీవుల్లో సొరచేపలు అత్యంత సున్నితమైన జీవులుగా భావిస్తారు. వీటి శరీరంలో ఉండే ‘ఆంపుల్లా ఆఫ్ లొరెంజిని’ అనే ప్రత్యేక అవయవం నీటిలోని స్వల్ప విద్యుత్ మార్పులను, పీడనంలో తేడాలను గుర్తించగలదు. దీని ద్వారా తుఫానులు లేదా సముద్రంలో సంభవించే మార్పులను ఇవి ముందుగానే అంచనా వేస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
తేనెటీగలు కూడా వాతావరణ మార్పులను వేగంగా గుర్తించే జీవులలో ఒకటి. గాలి పీడనం, తేమలో వచ్చే చిన్నపాటి మార్పులను ఇవి పసిగట్టి తుఫాను రాకముందే తమ తేనెపట్టులకు చేరుకుంటాయి. జపాన్‌లో క్యాట్‌ఫిష్‌లను భూకంప హెచ్చరిక జీవులుగా భావిస్తారు. నీటిలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఏర్పడే విద్యుత్ మార్పులను గుర్తించి ఇవి అసాధారణంగా ప్రవర్తిస్తాయని అక్కడి ప్రజల్లో విశ్వాసం ఉంది. అనేక సందర్భాల్లో భూకంపాలకు ముందు క్యాట్‌ఫిష్‌ల ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు కనిపించినట్లు నమోదైంది.
కుక్కలు కూడా ప్రకృతి మార్పులను ముందుగానే గుర్తించే సామర్థ్యం కలిగిన జంతువులలో ఒకటి. మనుషులతో పోలిస్తే వీటికి లక్ష రెట్లు అధిక వాసన పసిగట్టే శక్తి ఉంటుంది. గాలి పీడనంలో జరిగే మార్పులను కూడా ఇవి గుర్తించగలవని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే కొన్ని సందర్భాల్లో తుఫానులు లేదా ప్రకృతి వైపరీత్యాలకు ముందు కుక్కలు అసహజంగా ప్రవర్తించడం కనిపిస్తుంటుంది. ప్రకృతితో మమేకమై జీవించే ఈ జంతువులు పర్యావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తమ జీవన రక్షణ కోసం అప్రమత్తంగా వ్యవహరిస్తుంటాయి. ప్రకృతి సంకేతాలను ముందుగానే పసిగట్టే ఈ అద్భుత సామర్థ్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
ALSO READ: TG ICET- 2026: టీజీ ఐసెట్ 2026కు సర్వం సిద్ధం: కన్వీనర్ ఆచార్య అల్వాల రవి