HomeజాతీయంS. Keerthana: టీడీపీ వ్యూహకర్త నుంచి తమిళనాడు మంత్రిగా.. ఇదీ 29 ఏళ్ల కీర్తన ప్రస్థానం!

S. Keerthana: టీడీపీ వ్యూహకర్త నుంచి తమిళనాడు మంత్రిగా.. ఇదీ 29 ఏళ్ల కీర్తన ప్రస్థానం!

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఎస్‌. కీర్తన పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న తొమ్మిది మంది మంత్రుల్లో కీర్తన ఒక్కరే మహిళ కావడం విశేషం. కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రి పదవి దక్కించుకోవడం ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

శివకాశి నుంచి ఎమ్మెల్యేగా విజయం

టీవీకే పార్టీ తరఫున శివకాశి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కీర్తన విజయం సాధించారు. ముఖ్యంగా గత 70 ఏళ్లలో ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌తో సంబంధాలు ఉన్నాయి. కీర్తన పూర్వీకులు ఆంధ్రా నుంచి తమిళనాడుకు వెళ్లి విరుదునగర్ ప్రాంతంలో స్థిరపడ్డారు.

ఎన్నికల వ్యూహకర్తగా, రాజకీయ సలహాదారుగా

రాజకీయాల్లోకి రాకముందు కీర్తన ఎన్నికల వ్యూహకర్తగా, రాజకీయ సలహాదారుగా మంచి అనుభవం సంపాదించారు. షోటైమ్ కన్సల్టింగ్‌, ఐప్యాక్ వంటి సంస్థల్లో పనిచేస్తూ పలు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లో కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ, టీఎంసీ, డీఎంకే పార్టీలకు వ్యూహాత్మక సలహాలు ఇచ్చారు. టీడీపీ ఎన్నికల వ్యూహ బృందంలో భాగంగా హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కూడా నాలుగేళ్ల పాటు పనిచేశారు.

ఈ సమయంలో ఆమెకు ఎన్నికల నిర్వహణ, ఓటర్ల అభిరుచులు, ప్రచార ప్రణాళికలపై మంచి అవగాహన ఏర్పడింది. అదే అనుభవం ఇప్పుడు ఆమె రాజకీయ ప్రయాణానికి బలంగా మారింది. సోషల్ మీడియాలో కూడా కీర్తనకు మంచి గుర్తింపు ఉంది. రాజకీయ అంశాలపై ఆమెకు ఉన్న అవగాహన, ఇంటర్వ్యూలలో మాట్లాడే తీరు, ఎన్నికల వ్యూహాలపై ఉన్న పట్టును చూసి విజయ్ ఆమెకు శివకాశి టికెట్ ఇచ్చారని చెబుతున్నారు. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌ లో చదువు పూర్తి చేసిన కీర్తన తమిళం, తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. చిన్న వయసులోనే రాజకీయాల్లో ఎదిగి మంత్రి పదవి దక్కించుకోవడం ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు