ఎన్టీఆర్ జిల్లా, క్రైమ్ మిర్రర్: వీరులపాడు మండలం, వీరులపాడు గ్రామ పరిసరాల్లో అనధికారంగా వేట కోసం ఏర్పాటు చేసిన కరెంట్ ఉచ్చులు పెద్ద ప్రమాదానికి దారితీశాయి. జింకలు, దుప్పులు, అడవి పందులను వేటాడేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ తీగలను ఉపయోగించి ఉచ్చులు అమర్చినట్లు స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నిప్పులు చెలరేగడంతో సుమారు 5 ఎకరాల సుబాబులు తోటకు అగ్ని అంటుకుంది. మంటలు వ్యాపిస్తున్నాయని గమనించిన రైతులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. అక్కడ ఒక జింక మృతదేహం కనిపించిందని, చుట్టూ కరెంట్ తీగలు మెలివేసి ఉన్నాయని రైతులు తెలిపారు.
తాము కూడా ప్రమాదానికి గురయ్యే పరిస్థితి తృటిలో తప్పిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు, మూగజీవాలకు ముప్పు కలిగించే విధంగా ఇలాంటి అక్రమ ఉచ్చులు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు.