జమ్మకాశ్మీర్, క్రైమ్ మిర్రర్: జమ్ము కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఒక్కసారిగా బోల్తా పడిన ఘటనలో 15 మంది అక్కడికక్కడి మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది. జమ్మూ కాశ్మీర్ కాగోర్ట్ సమీపంలోని రామ్‌నగర్- ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని ఉదంపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకోగానే జిల్లా ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అతివేగంతోనే ప్రమాదం…
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సును అతివేగంగా నడపడం వల్లనే నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.. సోమవారం రామ్‌నగర్ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై ఉదంపూర్ జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.