-
బిజెపి దూకుడు ఆమెతో కళ్లెం
-
రాహుల్ కేవలం పార్లమెంటరీ నేతగానే పరిమితం
-
హస్తం పెద్దల సరికొత్త వ్యూహం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొన్నటి ఎన్నికల్లో పుంజుకున్నట్లే కనిపించింది కానీ.. నాయకత్వం మాత్రం రాటు తేలడం లేదు. ముఖ్యంగా రాహుల్ నాయకత్వం పై అనేక రకాల సందేహాలు క్యాడర్లోనే ఉన్నాయి. ఆయనకంటే సోదరి ప్రియాంకవాద్ర పైనే క్యాడర్ ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను, ప్రచార సారధ్యాన్ని రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ వాద్రా కే అప్పగించాలని కూడా కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నేత స్థానానికి పరిమితమవుతుండగా.. క్షేత్రస్థాయిలో అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను ప్రియాంక భుజాలకు ఎత్తుకునేలా ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీని క్యాడర్ ఎక్కువగా ఓన్ చేసుకుంటోంది.
ప్రచారానికి విశేష స్పందన…
వివిధ రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ ప్రచారానికి విశేష స్పందన వస్తోంది. రాహుల్ తో పోల్చుకుంటే సక్సెస్ రేట్ కూడా ఆమెకు అధికం. గతంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ భారత్ జూడో యాత్రలో బిజీగా ఉన్నప్పుడు ప్రియాంక నేతృత్వంలో సాగిన దూకుడు ప్రచారం కాంగ్రెస్‌కు అద్భుతమైన విజయాన్ని అందించగలిగింది. ముఖ్యంగా ఆమె ప్రసంగించే తీరు, ప్రజలతో మమేకమయ్యే విధానం, తన నాయనమ్మ ఇందిరా గాంధీని గుర్తుకు తెచ్చే హావభావాలు.. ఉత్తర, మధ్య భారత ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక నేతల మధ్య ఉండే గ్రూపు తగాదాలను చక్కదిద్దడంలోనూ.. మహిళా ఓటర్లను ప్రభావితం చేయడంలోనూ ప్రియాంక అనుసరించే శైలి రాహుల్ కంటే చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది.
ఆమె స్టైల్ వేరు…
ఇప్పటివరకు రాహుల్ గాంధీని నిలువరించగలిగింది బిజెపి. కానీ ప్రియాంక గాంధీ రంగంలోకి దిగితే ఆ సమీకరణ మారుతోంది. ఆమె ఎక్కువగా స్థానిక సమస్యలు, ధరల పెరుగుదల, మహిళా సంక్షేమం, నిరుద్యోగం వంటి అంశాల చుట్టూనే ప్రచారాన్ని నడిపిస్తూ బీజేపీపై ఎదురు దాడి చేస్తారు. దీనివల్ల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను స్థానిక అంశాలపైనే ఉంచడం కాంగ్రెస్ కు సాధ్యమవుతోంది. ఎంపీగా గెలిచిన తర్వాత ప్రియాంక కేవలం తెర వెనుక సంస్థాగత సర్దుబాట్లు చూసే నాయకురాలుగా కాకుండా.. పూర్తిస్థాయి మోస్ లీడర్‌గా ఆమెను ముందంజలో ఉంచాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు టార్గెట్…
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయస్థాయిలో అతిపెద్ద పార్టీగా నిలవాలని భావిస్తోంది. అది కేవలం ప్రియాంక గాంధీని రంగంలోకి దించడం వల్లే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్న ప్రతిసారి ప్రియాంక ఒక వరంలా భావిస్తున్నారు. ఈసారి పూర్తిస్థాయిలో ఆమెను ప్రయోగించి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని నిలువరించాలి అనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచన. ఒకవైపు పార్లమెంటరీ నేతగా రాహుల్ ఉంటూనే.. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు బాట ప్రియాంకకు అప్పగించాలి అనేది బలమైన వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
