చెన్నై, క్రైమ్‌మిర్రర్: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు సినీ వర్గాలలో వైరల్ గా మారాయి. దీంతో విజయ్ కొడుకు కావడంతో అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. కాగా ఇప్పటికే సిగ్మా చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పడు మెగా ఫోన్‌ను పక్కనపెట్టి కెమెరా ముందుకు వచ్చేందుకు సన్నహాలు చేస్తున్న తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, జేసన్‌తో ఇప్పటికే ‘సిగ్మా’ సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఆయనతో మరో సినిమా చేయడానికి తీవ్రంగా ఆసక్తి చూపుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో జేసన్ సంజయ్ హీరోగా నటించే అవకాశాలున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన హీరోగా నటించబోయే కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దర్శకుడు లింగుసామితో పాటు మరికొందరు డైరెక్టర్లు కథలను వినిపించినట్లు సమాచారం. అంతేకాకుండా, జేసన్ సంజయ్ బంధువైన ప్రముఖ నటుడు సంజీవ్ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించే రేసులో ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
