•బిజెపిలో అడుగడుగున బండి సంజయ్ దూకుడుకు కళ్లెం
•రైతు ఘోష బస్సు యాత్రకు అనుమతి నిరాకరణ
•తీవ్ర అంతర్మథనం లో కేంద్రమంత్రి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
బిజెపిలో బండి సంజయ్ కు బ్రేకులు పడ్డాయా? ఆయన విషయంలో హై కమాండ్ పునరాలోచినలో పడిందా? కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించిందా? రైతు గోష బస్సు యాత్రలో బండి అందుకే పాల్గొనలేదా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే చర్చ నడుస్తోంది. బండి సంజయ్ కుమారుడి వ్యవహారంతో బిజెపికి డామేజ్ అయినట్టు హై కమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో బండి సంజయ్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు రైతు గోష బస్సు యాత్రలో సైతం ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బండి సంజయ్ కు బిజెపిలో బ్రేకులు పడినట్టే నన్న చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.
బిజెపి బలోపేతం..
కరీంనగర్ కార్పొరేషన్ లో ఒక సామాన్య కార్పొరేటర్ బండి సంజయ్. దూకుడు కలిగిన నేతగా గుర్తింపు సాధించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న ఆయనకు పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కాయి. అదే దూకుడుతో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అభివృద్ధి చేశారు. ఒకానొక దశలో తెలంగాణలో బిజెపి అధికారం చేపడుతుంది అనే స్థితికి తీసుకొచ్చారు. ఆయన దూకుడు ఫలితంగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లతో సంతృప్తికర విజయాలను దక్కించుకుంది. అయితే అనూహ్యంగా బిజెపి రాష్ట్ర పగ్గాలను తప్పించిన హైకమాండ్.. కేంద్ర మంత్రి బాధ్యతలను ఇచ్చింది.
సొంత పార్టీ నేతలతో విభేదాలు..
అయితే భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ కు వ్యతిరేక వర్గం ఉందన్న ప్రచారం నడిచింది. ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తో ఆయనకు పడేది కాదు. ఈటెల రాజేందర్ సుదీర్ఘకాలంగా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ సీటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది. అయితే అక్కడ ఈటెల రాజేందర్ వర్గీయులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు బండి సంజయ్. దీంతో తరచూ వారి మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చేవి. మరోవైపు తమ పతనానికి కారణం బండి సంజయ్ అని గులాబీ పార్టీలో అభిప్రాయం ఉంది. ఒకవైపు సొంత పార్టీ శ్రేణులతో విభేదాలు.. మరోవైపు గులాబీ పార్టీతో అంతర్గత యుద్ధం జరుగుతున్న వేళ.. కుమారుడు లైంగిక పరమైన కేసుల్లో చిక్కుకున్నారు. ఇది బండి సంజయ్ కు ఇబ్బందికరంగా మారింది. అయితే బండి సంజయ్ కుమారుడు ఎపిసోడ్ తో పార్టీకి డ్యామేజ్ జరిగిందని హై కమాండ్ భావించింది. అందుకే బండి సంజయ్ దూకుడుకు ఎక్కడికక్కడే బ్రేకులు వేస్తోంది. మరి మున్ముందు బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.