తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేసిన డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పుడు విభేదాలు మొదలయ్యాయి. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి దగ్గరవుతుండటంతో డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ తమను మోసం చేసిందని భావిస్తున్న డీఎంకే, పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోలేమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
డీఎంకేకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నం
ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే మంచి ఫలితాలు సాధించగా, డీఎంకేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన డీఎంకే ఇప్పుడు కేంద్ర రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో బీజేపీ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీతో డీఎంకేకు గతంలోనూ మంచి సంబంధాలు
డీఎంకేకు బీజేపీతో గతంలో కూడా సంబంధాలు ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ కాలంలో డీఎంకే ఎన్డీఏ కూటమిలో భాగమైంది. తరువాత కాంగ్రెస్తో కలిసి పనిచేసింది. ఇప్పుడు కాంగ్రెస్తో దూరం పెరగడంతో మళ్లీ డీఎంకే కేంద్రానికి దగ్గరవుతుందా అన్న చర్చ మొదలైంది.మరోవైపు, తమిళనాడులో బీజేపీ పాత మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే బలహీనపడటం కూడా కీలకంగా మారింది. దీంతో అక్కడ బలమైన కొత్త మిత్రుడి కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
2027లో రాష్ట్రపతి ఎన్నికలు
ఇక 2027లో రాష్ట్రపతి ఎన్నికలు ఉండటంతో పాటు, పార్లమెంట్ లో కీలక బిల్లులు ఆమోదించుకోవడానికి కేంద్రానికి మరింత మద్దతు అవసరం. ముఖ్యంగా డీలిమిటేషన్ వంటి బిల్లుల విషయంలో డీఎంకే మద్దతు బీజేపీకి ఉపయోగపడొచ్చని భావిస్తున్నారు. అయితే డీఎంకే నేరుగా ఎన్డీఏలో చేరకపోయినా, అవసరమైనప్పుడు అంశాల వారీగా మద్దతు ఇచ్చే అవకాశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.