క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి (విద్యా), ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. విశాఖపట్నంలోని చంద్రంపాలెం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యార్థులతో ఎంతో ఆత్మీయంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను, పాఠశాల రోజుల్లో మార్కుల కోసం పడిన భయాన్ని, చేసిన అల్లరి పనులను పంచుకుని సభికులను నవ్వించారు.ప్రతి విద్యార్థి జీవితంలో ప్రోగ్రెస్ రిపోర్టులు, తల్లిదండ్రుల సంతకాలు అనగానే ఎంతో కొంత భయం ఉండటం సహజమని, తాను కూడా అందుకు మినహాయింపు కాదని లోకేష్ తెలిపారు. చిన్నప్పుడు స్కూల్ రిపోర్ట్ కార్డులో మార్కులు తక్కువ వచ్చినప్పుడు.. అమ్మకు చూపిస్తే ఎక్కడ కోప్పడుతుందోనన్న భయంతో, ఏకంగా అమ్మ సంతకాన్నే తాను పెట్టేయాలని (ఫోర్జరీ) ప్రయత్నించానని ఆయన నవ్వుతూ చెప్పారు. అయితే ఆ ప్రయత్నంలో తాను అడ్డంగా దొరికిపోయానని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.అమ్మ క్రమశిక్షణే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది”స్కూల్‌లో తక్కువ మార్కులు వస్తే మా అమ్మ నన్ను చితకబాదేవారు. రిపోర్ట్ కార్డుపై అమ్మ సంతకం పెడదామని ట్రై చేసి దొరికిపోయినప్పుడు ఆమె నాకు గట్టిగా బుద్ధి చెప్పారు.
తెలంగాణలో రేపటి నుంచి విస్తారంగా వర్షాలు: IMD తీపికబురు
జీవితంలో ఎప్పుడూ షార్ట్ కట్స్ వెతకకూడదని, తప్పుడు మార్గాల్లో వెళ్లకూడదని ఎంతో క్రమశిక్షణతో పెంచారు” అని లోకేష్ వివరించారు. ఈరోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి వంద శాతం తన తల్లే కారణమని ఆయన ఉద్వేగంగా పేర్కొన్నారు.తన తండ్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో రాజకీయాలతో అత్యంత బిజీగా ఉండేవారని లోకేష్ తెలిపారు. “నాన్నకు నా మార్కులు ఎలా వచ్చాయి? నేను ఎలా చదువుతున్నాను? అని పట్టించుకునేంత సమయం ఉండేది కాదు. నా పెంపకం, చదువు బాధ్యతలన్నీ అమ్మే దగ్గరుండి చూసుకునేది” అని చెప్పారు.ఒక రాష్ట్ర మంత్రి స్థాయి వ్యక్తి, తమలాగే చిన్నప్పుడు మార్కుల కోసం భయపడ్డారని, అల్లరి పనులు చేశారని తెలుసుకున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. లోకేష్ పంచుకున్న ఈ నిజజీవిత సంఘటనలు.. విద్యార్థుల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, క్రమశిక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.
