క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- వర్షాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎండలతో అల్లాడుతున్న వాతావరణం చల్లబడనుందని, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సరైన వర్షాలు లేక రైతన్నలు ఆందోళన చెందుతున్న తరుణంలో, ఐఎండీ తాజా అంచనాలు వారికి ఊరటనిస్తున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పెళ్లి హామీతో దగ్గరై.. చివరకు బెదిరింపులు.. ఎస్సైపై యువతి ఫిర్యాదు
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై వరుణుడు కరుణించే అవకాశం కనిపిస్తోంది. రేపు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.రైతులు తమ వ్యవసాయ పనులను ఈ వాతావరణ సూచనలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుండటంతో సాధారణ ప్రజలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
