Homeక్రైమ్వారణాసిలో దారుణం.. బాయ్‌ఫ్రెండ్‌ గదిలో యువతి మృతదేహం

వారణాసిలో దారుణం.. బాయ్‌ఫ్రెండ్‌ గదిలో యువతి మృతదేహం

క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో యువతి హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నీట్‌ పరీక్షకు సిద్ధమవుతూ ఎమ్మెస్సీ చదువుతున్న 20 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న యువతి ఆగస్టు 18న కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆ తర్వాత ఆమె తిరిగి ఇంటికి రాలేదు. మూడు రోజుల అనంతరం ఆమె మృతదేహం ఓ యువకుడి గదిలోని బాత్రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తొలుత బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫోన్‌ నంబర్‌ను ట్రాక్‌ చేయగా వారణాసిలోని మాలవీయ ఇంటర్‌ కాలేజీ ప్రాంతంలో లొకేషన్‌ కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదే సమయంలో యువతి తల్లి, మరో బంధువు మీర్జాపూర్‌ జిల్లాలోని సీఖర్‌ గ్రామంలో ఉన్న వివేక్‌ చౌబే మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ యువతికి సంబంధించిన బ్యాగ్‌ లభించింది. అందులో ఉన్న తాళం చెవిని తీసుకుని వివేక్‌ చౌబే ఉంటున్న గదికి వెళ్లి పరిశీలించగా బాత్రూమ్‌లో యువతి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా.. గొంతు కోయడం వల్లే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. యువతి తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమె కాళ్లు కట్టేసిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసులో యువతి బాయ్‌ఫ్రెండ్‌ వివేక్‌ చౌబేపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి నీతూ కడ్యాన్‌ వెల్లడించారు. నిందితుడి కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. వివేక్‌ చౌబే కొంతకాలంగా తమ కుమార్తెను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఆరోపించారు. ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటే, తమ కుమార్తె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ బెదిరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

యువతికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న మరో యువకుడితో వివాహం నిశ్చయమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వివేక్‌ చౌబే ఆగ్రహంతో ఉన్నాడని ఆరోపించారు. నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న యువతికి చదువులో సహాయం చేస్తానని నమ్మించి ఆగస్టు 18న తన గదికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు యువతి ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉంటున్న ఇంటి ప్రధాన ద్వారం వద్ద సీసీటీవీ పనిచేయకపోవడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆధారాలను చెరిపివేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కెమెరాను పనిచేయకుండా చేశారా? లేదా ఘటనలో మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.

వివేక్‌ చౌబే రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా గత మూడేళ్లుగా మేనమామ ఇంట్లో ఉంటున్నాడని సమాచారం. మేనమామతో కూడా అతడికి విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన స్వగ్రామమైన నియార్దిహ్‌లో గ్రామ ప్రధాన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పరారీలో ఉన్న వివేక్‌ చౌబే కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. యువతి హత్యకు దారితీసిన అసలు కారణాలు, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read : కొండా ఫ్యామిలీ ఒంటరి…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు