దసరా పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తం 5,261 ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది. మరోవైపు, ఈ బస్సుల్లో ప్రయాణించే వారి నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని సంస్థ స్పష్టం చేసింది. సాధారణ టికెట్ ధరలే వర్తిస్తాయని తెలిపింది.
అక్టోబర్ 16 నుంచి 25 వరకు ప్రత్యేక సర్వీసులు
దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 16 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పండుగకు ముందు ప్రయాణికుల అవసరాల కోసం అక్టోబర్ 16 నుంచి 19 వరకు 3,207 సర్వీసులను ఏర్పాటు చేశారు. పండుగ అయిపోయిన తర్వాత మళ్లీ తమ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం అక్టోబర్ 20 నుంచి 25 వరకు మరో 2,054 బస్సులను అందుబాటులో ఉంచనున్నారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సర్వీసులను కేటాయించారు.
ఏ నగరానికి ఎన్ని బస్సులంటే?
ప్రత్యేక బస్సుల కేటాయింపులో హైదరాబాద్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 1,186 బస్సులను నడపనున్నారు. విజయవాడకు 1,053, బెంగళూరుకు 475, విశాఖపట్నానికి 440 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. తిరుపతికి 247, రాజమండ్రికి 347, చెన్నైకి 153 బస్సులను కేటాయించారు.
జిల్లాల వారీగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా నుంచి అత్యధికంగా 804 ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించడం గమనార్హం. పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ బస్సులు సేవలు అందించనున్నాయి.
ప్రయాణికులకు ఆర్టీసీ సూచనలు
దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను తెలుసుకుని, వీలైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.
also read: ఢిల్లీ నిరసనకు పోలీసుల బ్రేక్.. జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనకు అనుమతి నిరాకరణ!
