క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య పాలనపై తన పట్టును కొనసాగించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధిష్టానం సూచనలతో తాజాగా సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు అల్పాహార విందు ఏర్పాటు చేసిన ఆయన.. పదవి మార్పుపై ప్రకటన చేశారు. సీఎం బాధ్యతల నుంచి తప్పుకుంటున్న సిద్ధరామయ్యను కేంద్ర రాజకీయాల్లోకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించింది. రాజ్యసభ స్థానాన్ని కేటాయించడంతోపాటు పార్టీలో సముచిత స్థానం కల్పించడంపై హామీ ఇచ్చింది. అయితే, సిద్ధరామయ్య వాటికి ససేమిరా అనడంతో ఏం జరుగుతోందనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలను డీకే శివకుమార్ తీసుకున్నప్పటికీ పాలనపై తన పట్టును కొనసాగించేలా సిద్దూ ప్రతిపాదనలు చేసినట్టు చెబుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో సిద్ధరామయ్య ఢిల్లీలో వరుసగా భేటీలు అవుతున్నారు.
పాలనపై పట్టు చిక్కేలా కో-ఆర్డినేషన్ కమిటీ..
కర్ణాటకలో అత్యంత బలమైన నాయకుడిగా శివకుమార్‌కు పేరుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద కూడా పలుకుబడి ఉండడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత శివకుమార్ ప్రాభవం రాష్ట్రంలో పెరుగుతుందని సిద్ధరామయ్య అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మాజీ సీఎంగా తన ప్రతిష్ట మసకబారకుండా ఉండేందుకు ఆయన వ్యూహా రచన చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కీలక ప్రతిపాదనలను అధిష్టానానికి ఆయన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా కో-ఆర్డినేషన్ కమిటీ వేయాలంటూ సిద్ధరామయ్య కొత్త మెలిక అధిష్టానం వద్ద పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే, కేబినెట్లో తన వర్గానికి చెందిన 15 మంది ఉండేలా సిద్ధరామయ్య అధిష్టానాన్ని కోరారు. తన మనుషులకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఆయన కోరినట్టు చెబుతున్నారు. కీలక మంత్రి పదవులను కూడా తన మనుషులకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో పదవీ మార్పిడి అత్యంత సులభంగా జరిగేట్టు కనిపించడం లేదు. ఈ మెలికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధరామయ్య షరతులకు అంగీకరిస్తే దానిపై డీకే ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.