-
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు కృపారాణికి…!
-
వైయస్ షర్మిల కు మరో షాక్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ వైయస్ షర్మిల కు షాక్ ఇచ్చింది. రాజ్యసభ పదవి ఇవ్వకుండా మొండి చేయి చూపింది. కర్ణాటక కోటాలో షర్మిలకు రాజ్యసభ పదవి అని లీకులు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆ పదవిని కాంగ్రెస్ మీడియా కన్వీనర్ పవన్ ఖారే దక్కించుకున్నారు. ఒక విధంగా ఇది షర్మిలకు షాకింగ్ పరిణామమే.
అయితే ఇప్పుడు షర్మిలకు మరోసారి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో పిసిసి అధ్యక్షురాలిగా ఆమె మార్పు ఖాయమని సమాచారం. ఆమె స్థానంలో ఒక బీసీ మహిళ నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. షర్మిల కు పదవి ఇచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో ఆమెను మార్చి.. ఏఐసీసీలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది.
రెండేళ్ల కిందట పగ్గాలు..
తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. కానీ అది ఆశించిన స్థాయిలో అక్కడ ఫలితం చూపలేదు. అందుకే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అందుకు అంగీకరించలేదు.
ఏపీలో పార్టీ పగ్గాలు తీసుకోవాలని సూచించడంతో షర్మిల తీసుకున్నారు. ఆ సమయంలోనే ఆమెకు రాజ్యసభ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే షర్మిల కాంగ్రెస్ వర్గాలు తీసుకున్నాక రాష్ట్రంలో వైసిపి పతనం ప్రారంభం అయింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎదగలేకపోయింది. అందుకే ఇప్పుడు షర్మిల మార్పు అనివార్యంగా తెలుస్తోంది.
జెయింట్ కిల్లర్గా గుర్తింపు..
షర్మిల స్థానంలో బిసి మహిళా నేత కిల్లి కృపారాణికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఆమె శ్రీకాకుళం ఎంపీ తో పాటు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2004 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కింజరాపు ఎర్రం నాయుడుకు గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఓటమి తప్పలేదు. అదే పట్టుదలతో వ్యవహరించి 2009లో రెండోసారి పోటీ చేసి ఎర్రం నాయుడు పై గెలిచారు. జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయిన ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆమెకు మాత్రం ఎటువంటి అవకాశాలు దక్కలేదు. అందుకే 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. బీసీ నేతగా గుర్తింపు పొందిన ఆమె కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే షర్మిలకు షాక్ తగిలినట్లే.