Homeసినిమారాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు అనిల్ రావిపూడి ఫన్నీ టచ్.. రక్తంతో వీర తిలకం వీడియో వైరల్!

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు అనిల్ రావిపూడి ఫన్నీ టచ్.. రక్తంతో వీర తిలకం వీడియో వైరల్!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వెంకటేశ్, కళ్యాణ్‌రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌లోకి అడుగుపెట్టనుంది. అయితే షూటింగ్ మొదలయ్యే ముందే అనిల్ రావిపూడి తనదైన శైలిలో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, గేయరచయిత అనంత శ్రీరామ్‌లతో సరదా వీడియోలు చేసి ప్రేక్షకులను అలరించిన అనిల్, తాజాగా మరో ఫన్నీ వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఈ వీడియోలో అనిల్ రావిపూడి చేతిలో కత్తి పట్టుకుని వెంకటేశ్, కళ్యాణ్‌రామ్ ముందుకు వచ్చి ఎప్పుడూ నేనే ఐడియాలు ఇవ్వాలా? అంటూ సరదాగా ప్రశ్నిస్తారు. అయితే వెంటనే వెంకటేశ్ ఆ కత్తిని తీసుకుని అనిల్ వేలికి చిన్న గాటు పెట్టి అదే రక్తంతో ఆయన నుదుటిపై వీర తిలకం దిద్దుతారు. దీంతో ఒక్కసారిగా అనిల్ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కళ్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి కూడా అదే తరహాలో తిలకం దిద్దడంతో అనిల్ మరింత అవాక్కవుతారు. వీడియోలో జీవీ ప్రకాశ్ కుమార్ కూడా తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. నా కడుపు నిండిపోయిందిరా అంటూ అనిల్ వేలిని పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోవడం నవ్వులు పూయించింది. మొత్తం వీడియో అంతా సరదా సంభాషణలు, ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌లతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి “ఎంత రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అయితే మాత్రం మరీ అంత రక్తపాతం అవసరమా.. మనది ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్” అంటూ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా నేపథ్యంపై చిన్న హింట్ ఇస్తూనే, తన కామెడీ మార్క్‌ను కూడా చూపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్, కళ్యాణ్‌రామ్‌తో పాటు కీర్తి సురేశ్, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం విడుదలైన ప్రమోషనల్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు