Homeఆంధ్ర ప్రదేశ్ఏడుకొండలపై భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనానికి నిరీక్షణ!

ఏడుకొండలపై భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనానికి నిరీక్షణ!

కలియుగ వైకుంఠంగా భక్తులు ఆరాధించే తిరుమలలో వేసవి తీవ్రత మధ్య భక్తజన సందోహం రోజురోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా “గోవిందా.. గోవిందా..” నామస్మరణలతో తిరుమల మారుమోగుతోంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతున్న పరిస్థితి నెలకొంది. క్యూలైన్లు శ్రీవారి సేవాసడన్ వరకు విస్తరించాయి. అయితే సమయ నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేస్తూ సాధారణ భక్తులకు కూడా వేగంగా దర్శనం కల్పించే దిశగా చర్యలు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రతిరోజూ అదనంగా 15 వేల మందికి దర్శన సౌకర్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

టీటీడీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 5 రోజుల్లో మొత్తం 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో మే 16, మే 17 తేదీల్లో రికార్డు స్థాయిలో 90 వేలకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషంగా నిలిచింది. మే 16న 90,011 మంది, మే 17న 91,020 మంది, మే 18న 80,455 మంది, మే 19న 84,412 మంది, మే 20న 86,315 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. మరోవైపు మే 21, 2026 ఒక్కరోజే 79,603 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లుగా నమోదైంది. భారీ రద్దీ ఉన్నప్పటికీ దర్శన ఏర్పాట్లు నిరంతరంగా కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఎండల తీవ్రత భక్తులపై ప్రభావం చూపకుండా టీటీడీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. బాటగంగమ్మ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఆలయ పరిసరాలు, లడ్డూ పంపిణీ కేంద్రాల వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవన ప్రాంతాల్లో అదనపు నీడ సదుపాయాలతో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల పాదాలకు వేడి తగలకుండా నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక చల్లదనాన్ని కలిగించే పూత పూయించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.

భక్తులకు ఆహార పంపిణీ కూడా విస్తృత స్థాయిలో కొనసాగుతోంది. ఉదయం పాలు, ఉప్మా, పొంగల్ అందిస్తుండగా, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమోటా అన్నం పంపిణీ చేస్తున్నారు. రాత్రి మళ్లీ ఉప్మా, సాంబారన్నం అందిస్తున్నారు. మొబైల్ నీటి వాహనాల ద్వారా తాగునీటిని నిరంతరం సరఫరా చేస్తున్నారు. గత 5 రోజుల్లో దాదాపు 19 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, మజ్జిగ పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్ క్యూలైన్ల వెంట మొబైల్ ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచారు.

తిరుమలలో వసతి గదులు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మొత్తం 7,500 గదులు, 5 యాత్రికుల వసతి సముదాయాల ద్వారా గరిష్టంగా 60 వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంది. గదులు దొరకని భక్తుల కోసం వివిధ కేంద్రాల్లో 9 వేల లాకర్లను ఏర్పాటు చేశారు. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 చిన్న కల్యాణకట్టల్లో సేవలు కొనసాగుతున్నాయి. మే 18 నుంచి మే 20 వరకు ప్రతిరోజూ 43 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే 5 భాషల్లో ప్రసార వ్యవస్థ ద్వారా దర్శన సమయాలు, రద్దీ వివరాలను భక్తులకు తెలియజేస్తున్నారు. భారీ రద్దీ కారణంగా రాత్రి సమయంలో కొత్తగా క్యూ లైన్లలోకి రావద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

ALSO READ: ప్రేమను ముందే ఊహిస్తున్న GenZలు

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు