-
రెండేళ్ల కిందట బిర్యానీ తింటూ రాహుల్ గాంధీ ప్రకటన
-
రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ
-
దానిని గుర్తు చేస్తూ గులాబీ పార్టీ ఆందోళన
-
తిప్పికొట్టిన కాంగ్రెస్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాద్ బిర్యానీకి జాతీయ స్థాయిలో సైతం మంచి గుర్తింపు ఉంది. అందులోనూ బావర్చి బిర్యానీని ఇష్టపడని వారు ఉండరు. అటువంటి బావర్చి బిరియాని హోటల్ రాజకీయ ఘర్షణలకు వేదికగా మారింది. దానికి కారణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 2023 నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే హోటల్ కు వచ్చారు. బిర్యానీ తింటూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ పర్యటన జరిగి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి గుర్తు చేసేందుకు గులాబీ పార్టీ సోషల్ మీడియా బృందం, యూత్ లీడర్స్ వినూత్న నిరసన చేపట్టారు బావర్చి బిర్యానీ పాయింట్ వద్ద..
ఇరువర్గాల ఘర్షణ…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటం, బొమ్మను ఏర్పాటు చేసి దానికి బిర్యానీ తినిపిస్తూ నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ ఒక రాజకీయ పర్యాటకుడిలా వచ్చి వెళ్తున్నారు తప్ప.. నాడు ఇదే టేబుల్ వద్ద కూర్చొని నిరుద్యోగులకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని పట్టించుకోవడం లేదు అంటూ గులాబీ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఈ నిరసన కార్యక్రమం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. స్వల్ప తోపులాటకు దారి తీసుకోవడంతో హోటల్ ఆవరణలో గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనతో బిర్యానీ తినేందుకు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు.
అదుపు తప్పిన వైనం…
అయితే తెలంగాణలో ఒక రాజకీయ పరమైన వివాదానికి.. బావర్చి బిర్యానీ హోటల్ వేదిక కావడం ఒక్కసారిగా రచ్చకు దారితీసింది. కొందరు కాంగ్రెస్ కీలక నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనవసరంగా రాజకీయ వివాదానికి బావర్చి బిర్యాని హోటల్ బలి కావడం ఆందోళనకు దారితీసింది. కేవలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బసచేసినందుకుగాను బావర్చి హోటల్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
