క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక ప్రమాదం మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంటూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా అనకాపల్లి–ఆనందపురం రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెండు లారీలు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, డ్రైవర్, క్లీనర్ వాటిలో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి–ఆనందపురం రహదారిపై బాటజంగాలపాలెం సమీపంలో రహదారి పక్కన ఓ లారీ నిలిపి ఉంచారు. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ అదుపుతప్పి ఆగి ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు భారీగా ఎగిసిపడటంతో లారీ క్యాబిన్లో ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో మృతిచెందిన వారిని మాదాసూరి అప్పారావు (45), శ్యాంప్రసాద్ (22)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భోగాపురం హైవేపై మరో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
ఇదిలా ఉండగా.. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై కూడా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుందరపేట సమీపంలో రహదారిపై నిలిపి ఉంచిన ట్యాంకర్ను వేగంగా వచ్చిన థార్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఒకే సమయంలో కాకపోయినా.. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాలు వాహనదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై వాహనాలు నిలిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ప్రయాణించే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
also read : రైస్ మిల్లర్ల దందా….!
