-
ఏపీ కేంద్రంగా ప్రాంతీయ విమానయాన సంస్థ
-
హెడ్ క్వార్టర్ గా భోగాపురం ఎయిర్పోర్ట్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ కేంద్రంగా ఏర్పాటయింది ఎయిర్ ఇండో ఎయిర్లైన్స్. ప్రాంతీయ విమానయాన సంస్థగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర విమానయాన రంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతోంది. శ్రీనివాస్ చిలుకూరి నేతృత్వంలో రూపొందించిన ఈ సంస్థ.. అత్యాధునిక ఏ టి ఆర్ 72- 600 విమాన శ్రేణితో మే 2027 నుంచి తన వాణిజ్య విమాన సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాల మధ్య విమాన అనుసంధానాన్ని పెంచడం ద్వారా సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో.. వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ ఎయిర్ లైన్స్ అడుగులు వేస్తోంది.
ఆ రెండు విమానాశ్రయాలు కేంద్రంగా…
ఈ ప్రాంతీయ విమానయాన సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఏపీలో రెండు విమానాశ్రయాలను ప్రధాన కేంద్రాలుగా చేసుకుంది. భోగాపురం లోని నూతన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ ఇండో ఎయిర్లైన్స్ కు ప్రధాన బేస్ ఎయిర్ పోర్టుగా వ్యవహరించనుంది. అలాగే రాజధాని ప్రాంతంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ విమానాల పార్కింగ్, నిర్వహణకు ప్రధాన హబ్ గా ఉపయోగపడనుంది. ప్రాథమికంగా 3 ఏటిఆర్ 72 – 600 విమానాలతో సేవలను ప్రారంభించి.. విమానాల సంఖ్యను విస్తరించాలని ప్రణాళికలు రచించింది.
తొలి దశలో ఇలా…
తొలి దశలో ఏపీ కారిడార్ లో భాగంగా విశాఖ – విజయవాడ- హైదరాబాద్ నగరాల మధ్య 45 నుంచి 60 నిమిషాల వ్యవధిలోనే చేరుకునేలా విమానాలను నడపాలని ప్రతిపాదించింది. దీనితోపాటు విజయవాడ – గోవా.. అలాగే హైదరాబాద్- భోపాల్ – పూణే కారిడార్లను కూడా తన నెట్వర్క్ లో చేర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమిక ఎన్ఓసి, కేంద్ర హోం శాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ పొందిన ఎయిర్ ఇండో ఎయిర్లైన్స్.. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి తుది అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.
