-
సీఎం రేవంత్‌పై ఆగని రాజగోపాల్ రెడ్డి మాటల యుద్ధం
-
సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి హెచ్చరికలు చేసినా వెనక్కి తగ్గని మునుగోడు ఎమ్మెల్యే
-
‘దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ క్షమించదు’ అంటూ ఎక్స్‌లో ఘాటు పోస్ట్
-
ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మపరిశీలన జ్ఞానం ప్రసాదించాలంటూ అయ్యప్ప స్వామికి వేడుకోలు
-
రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా? పీసీసీ నిర్ణయంపై ఉత్కంఠ
క్రైమ్ మిర్రర్, మునుగోడు, నల్గొండ ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల అనంతరం కూడా రాజగోపాల్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎక్స్ వేదికగా మరోసారి ఘాటుగా స్పందించారు.
ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలని, అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని ఆయన పేర్కొన్నారు. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో అవినీతికి పాల్పడుతూ, ప్రజల అవసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నటికీ క్షమించదంటూ తన పోస్టులో వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ధర్మబద్ధంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మపరిశీలన జ్ఞానాన్ని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించినవేనన్న చర్చ సాగుతోంది.
-
పీసీసీ ఏం చేయబోతోంది?
మరోవైపు, ముఖ్యమంత్రిపై రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వరుస వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఎమ్మెల్యే వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందని వెల్లడించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా? పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? లేక మరోసారి సర్దుబాటు ధోరణిని అవలంబిస్తుందా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే నోటీసుల జారీపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేదు. మొత్తానికి సీఎం వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా సాగుతున్న ఈ మాటల యుద్ధం తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
Epaper : https://epaper.crimemirror.com/newspaper/crime-mirror-telugu-daily-newspaper-50/
