క్రైమ్ మిర్రర్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గుర్తుతెలియని వ్యక్తికి చెందిన శరీర భాగాలు వరుసగా బయటపడుతుండటం తీవ్ర సంచలనంగా మారింది. గాంధీనగర్ కాలనీలో మనిషి శరీర భాగాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మనిషికి చెందిన కాళ్లు లభ్యం కాగా, తాజాగా మరోసారి అదే ప్రాంతంలో మానవ తల బయటపడటం తీవ్ర కలకలం రేపింది.
స్థానికులు గుర్తించిన సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ లభ్యమైన తలను పరిశీలించి, ఆధారాలు సేకరించే చర్యలు చేపట్టారు. ఈ శరీర భాగాలు ఎవరివి? అసలు ఇక్కడికి ఎలా చేరాయి? ఎవరు పడేశారు? అనే అంశాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
మూడు రోజుల క్రితం లభించిన కాళ్లు, తాజాగా బయటపడిన తల ఒకే వ్యక్తికి చెందినవా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందా? లేక వేర్వేరు ఘటనలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఈ శరీర భాగాలు ఒకే వ్యక్తికి చెందినవిగా తేలితే, హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసి ఉంటారనే అనుమానాలకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది.
మరోవైపు మృతుడి ఆచూకీ గుర్తించడం పోలీసులకు కీలకంగా మారింది. ఇటీవల అదృశ్యమైన వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు, లభ్యమైన శరీర భాగాల ఆధారంగా మృతుడి గుర్తింపు కోసం అవసరమైన పరీక్షలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? వ్యక్తిగత కక్షలతో హత్యకు పాల్పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఒకే ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో మనిషి కాళ్లు, తల బయటపడటంతో గాంధీనగర్ కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా, శరీర భాగాల గుర్తింపు, వాటి మధ్య సంబంధం, ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకున్న ఈ వరుస ఘటనల మిస్టరీ ఎప్పుడు వీడుతుందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
also read : రూ.లక్ష కోట్ల మేఘా…! ఏకైక అధిపతిగా కృష్ణా రెడ్డి…
