ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బాపట్ల మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం వ్యవహరించిన తీరుతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పొత్తులో భాగంగా బాపట్ల మున్సిపాలిటీ ఛైర్మన్ స్థానం బీజేపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇస్కా సునీల్‌ను అభ్యర్థిగా పార్టీ నాయకత్వం ప్రకటించింది. అయితే ఈ ఎంపికను అన్నం సతీశ్ ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. బాపట్లకు సంబంధం లేని స్థానికేతర వ్యక్తికి అవకాశం కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. స్థానికంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పక్కనపెట్టి, బయటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అసహనం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలపై తన అభ్యంతరాలను తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు రాజీనామా లేఖ పంపించారు. గత ఏడేళ్లుగా ఎలాంటి పదవులను ఆశించకుండా పార్టీ కార్యకర్తగా పనిచేశానని లేఖలో పేర్కొన్నారు. అయితే బాపట్ల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం స్థానిక నాయకులను, బాపట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉందని ఆరోపించారు.
కాగా, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన అన్నం సతీశ్ ప్రభాకర్ గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 ఎన్నికల అనంతరం టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న ఆయన ఇప్పుడు స్థానిక ఎన్నికల సమయంలో పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థి ఎంపికపై మొదలైన అసంతృప్తి చివరకు రాజీనామాకు దారితీయడంతో బాపట్ల రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
also read: రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడాకుల వార్తలకు చెక్.. మా బంధం ఇప్పటికీ అలాగే ఉందంటూ నటి క్లారిటీ!
