-
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా కర్ణాటక వ్యూహకర్త
-
దారి పొడవునా అనేక ముళ్ళు
-
దాటుకొని వెళ్లగలరా?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. ఆ పార్టీ అంటేనే వర్గ విభేదాలు, అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నేతలు చేసే వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తుంటాయి. ముఖ్యంగా జిల్లాల్లో వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్చార్జిగా యువనేత, వ్యూహకర్త సందీప్ నియమితులు కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత నియమితులైన ఏ ఇంచార్జ్ కూడా ప్రశాంతంగా పదవీకాలం పూర్తి చేసుకున్న దాఖలాలు లేవు. కుంతియా నుంచి దీపాదాసు మున్షి.. ఆ తరువాత మీనాక్షి నటరాజ్యం వరకు ప్రతి ఒక్కరు రాష్ట్ర కాంగ్రెస్ లోని వర్గ పోరు, సీనియర్ల అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలను తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారనేది బహిరంగ రహస్యం. పార్టీలో ఎవరికి వారు చక్రం తిప్పాలని చూసే తత్వంతో పాటు అధిష్టానానికి ఫిర్యాదులు చేసే సంస్కృతి కారణంగా ప్రతి ఇంచార్జ్ చేతులెత్తేసిన పరిస్థితులే గతంలో కనిపించాయి.. ఇప్పుడు అదే బాధ్యతను చేపట్టిన కొత్త ఇన్చార్జ్ సందీప్ ముందు కూడా అటువంటి అగ్నిపరీక్షలు ఉన్నాయి.
సీఎంతో సమన్వయంతోనే…
సందీప్ సక్సెస్ అవుతారా లేదా అనేది సీఎం రేవంత్ తో సమన్వయంతోనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ సీఎం రేవంత్ చేతికి పూర్తి పగ్గాలు అప్పగించి.. ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా సందీప్ అడుగులు వేస్తే మాత్రం సగం సమస్యలు తొలగిపోయే పరిస్థితి ఉంది. రేవంత్ మార్కు రాజకీయ శైలికి అనుగుణంగా, ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోకుండా కేవలం సంస్థాగత ప్రక్షాళన పై దృష్టి పెడితే.. ఇన్చార్జిగా ఆయన మనుగడ సాఫీగా సాగే అవకాశం ఉంది. గతంలో కొందరి ఇంచార్జ్ లు స్థానిక సర్క్యూట్ పాలిటిక్స్ లో వేలు పెట్టి విఫలమైన చరిత్రను సందీప్ దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
అధిష్టానం ఆలోచన చేస్తే…
కాంగ్రెస్ అధిష్టానం లేదా హై కమాండ్ లోని కొందరు పెద్దల ఆలోచనల మేరకు.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి మాత్రమే పూర్తిగా పట్టు ఉండకూడదు, పార్టీ హై కమాండ్ నియంత్రణ ఉండాలి అని ఉద్దేశంతో సందీప్ కు అదనపు అధికారాలు అప్పగిస్తే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త రచ్చ మొదలు కావడం ఖాయం. ఒకవేళ ఇంచార్జ్ కనుక పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ.. క్యాడర్, నామినేటెడ్ పదవుల విషయంలో పెత్తనం చెలాయించాలని చూస్తే.. అది సీఎం వర్గానికి, పార్టీలోని ఇతర సీనియర్ల మధ్య ఉండే నిప్పు రాజేస్తుంది. ఇప్పటికే వివిధ రూపాల్లో నడుస్తున్న అంతర్గత పోరు కాస్త తారాస్థాయికి చేరి.. పార్టీని తీవ్ర సంక్షోభంలో పెట్టే ప్రమాదం ఉంది.
