-
గులాబీ పార్టీ అగ్రనేతలపైనే నేరుగా విమర్శలు
-
సరైన రీతిలో తిప్పికొట్టలేకపోతున్న బిఆర్ఎస్
-
రేవంత్ ఏజెంట్ అంటూ ఆరోపణలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గులాబీ పార్టీ నాయకత్వం మధ్య పోరు గట్టిగానే సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సిద్దిపేటలో కవిత మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు చేశారు.. భూకంప జోన్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని.. కొండపోచమ్మ సాగర్ నుంచి కెసిఆర్ ఫామ్ హౌస్ కు కాలువ నిర్మించారని.. నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగుల నిధులు మళ్లింపు పేరుట 200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న విజిలెన్స్ నివేదికలు, రికార్డులను ప్రస్తావిస్తూ ఆమె గులాబీ పార్టీ అగ్రy నేతలైన హరీష్ రావు, కేటీఆర్ ల పై విమర్శలు గుప్పించారు.
రాజకీయ సెగలు…
కవిత కామెంట్స్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సెగలు పుట్టించాయి. దీనిపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఎదురుదాడికి దిగారు. కవిత లేవనెత్తిన అంశాలపై సాంకేతిక వివరణలు ఇస్తూనే.. ప్రధానంగా ఆమెపై సీఎం రేవంత్ రెడ్డి ముద్ర వేసేందుకు ప్రయత్నం చేశారు. మల్లన్న సాగర్ కు కేంద్ర జల సంఘం, జిఎస్ఐ అనుమతులు ఉన్నాయని.. నిమ్స్ ఉద్యోగుల మేలు కోసం ఈపీఎఫ్ నిర్ణయం తీసుకున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో రహస్య విజిలెన్స్ నివేదికలు కవిత చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ.. అవి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు లేనని.. ఆమె కాంగ్రెస్కు నాలుగో అనుబంధ సంస్థ అని.. రేవంత్ రక్షణ సేనగా అభివర్ణించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్…
మరోవైపు కవితపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్ కుమార్. 2010- 2012 మధ్యకాలంలో ఆడి కోర్ ఇన్ఫ్రా అనే కంపెనీలో రేవంత్ రెడ్డి, కవిత, సూదిని సృజన్ రెడ్డి డైరెక్టర్లుగా పని చేశారని.. ఒకే చిరునామాతో 30 కంపెనీలు పెట్టారని ప్రవీణ్ కుమార్ కొన్ని పత్రాలను ప్రస్తావించారు. కవిత రాజకీయ సన్యాసం తీసుకోవాలని.. గులాబీ పార్టీ నేతలపై చేస్తున్న నిరాధార ఆరోపణలపై న్యాయ పరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్షంగా అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన కవిత.. కేవలం బి ఆర్ ఎస్ నేతలను మాత్రమే టార్గెట్ చేసుకోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలం ఉందని గులాబీ పార్టీ నాయకత్వం చెబుతోంది.
సరిగ్గా సమాధానం ఇవ్వలేక…
కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ పెద్దలను ఇరుకున పట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ముఖ్యంగా ఆమె హరీష్ రావు పై నిప్పులు చెరుగుతున్నారు. గులాబీ పార్టీ నేతలు ఆరోపణల లోతుల్లోకి వెళ్లి సమగ్ర సమాధానాలు ఇవ్వడం కంటే.. ఆమెను రేవంత్ ఏజెంట్గా చిత్రీకరించి.. న్యాయపరమైన పోరాటాలు అంటూ బెదిరింపు ధోరణికి దిగుతుండడం మాత్రం చర్చకు దారి తీస్తోంది.
