సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక సమాచారం అందించింది. పండుగ సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో టికెట్ రిజర్వేషన్లకు సంబంధించిన తేదీలను వెల్లడించింది. రైల్వే శాఖ అమలు చేస్తున్న 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ విధానం ప్రకారం.. జనవరిలో జరగనున్న భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రయాణాలకు నవంబర్ 14 నుంచి టికెట్ బుకింగ్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి 14న భోగి పండుగ రోజున ప్రయాణించాలనుకునే వారు నవంబర్ 14న టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 15న సంక్రాంతి ప్రయాణాలకు నవంబర్ 15న, జనవరి 16న కనుమ సందర్భంగా ప్రయాణించేవారు నవంబర్ 16న రిజర్వేషన్లు చేసుకోవచ్చు.
ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లు పొందవచ్చు. పండుగ రోజుల్లో సీట్లకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణ తేదీకి సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన వెంటనే టికెట్లు రిజర్వ్ చేసుకోవడం మంచిది.
మరోవైపు సంక్రాంతి రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రయాణికుల అవసరాలను బట్టి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, రైళ్ల షెడ్యూల్‌ను రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది.
సంక్రాంతి సెలవుల కోసం ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నవారు ఈ తేదీలను గుర్తుంచుకోవడం ద్వారా చివరి నిమిషంలో టికెట్ల ఇబ్బందులను నివారించుకోవచ్చు.
also read: కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. రన్‌వేపైకి వీధి కుక్క.. తృటిలో తప్పిన విమాన ప్రమాదం!
