Homeజాతీయంకోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. రన్‌వేపైకి వీధి కుక్క.. తృటిలో తప్పిన విమాన ప్రమాదం!

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. రన్‌వేపైకి వీధి కుక్క.. తృటిలో తప్పిన విమాన ప్రమాదం!

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే రన్‌వేపైకి ఓ వీధి కుక్క ప్రవేశించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. పైలట్ అప్రమత్తతతో పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా ఓ ఇండిగో విమానాన్ని ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చింది.

విమానాశ్రయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోల్‌కతా నుంచి రాంచీకి వెళ్లేందుకు సిద్ధమైన ఇండిగో విమానం టేకాఫ్ కోసం రన్‌వేపైకి చేరుకుంది. విమానం బయలుదేరడానికి కొద్ది క్షణాల ముందు రన్‌వేపై ఓ కుక్క సంచరిస్తున్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన ఈ విషయాన్ని ఏటీసీ అధికారులకు తెలియజేశారు. రన్‌వేపై జంతువు ఉండటం వల్ల విమానానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

ఇదే సమయంలో చెన్నై నుంచి కోల్‌కతాకు వస్తున్న మరో ఇండిగో విమానం ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉంది. రన్‌వేపై కుక్క ఉన్నట్లు సమాచారం అందడంతో ఏటీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కోల్‌కతాలో విమానాన్ని దించేందుకు అనుమతించకుండా ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి వెళ్లాలని పైలట్‌కు సూచించారు. దీంతో కోల్‌కతాకు సుమారు 187 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా అండాల్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, అత్యంత భద్రత ఉండాల్సిన విమానాశ్రయ రన్‌వేపైకి వీధి కుక్క ఎలా ప్రవేశించిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. విమానాల రాకపోకలకు కీలకమైన ప్రాంతంలో భద్రతా లోపం ఏమైనా ఉందా? సిబ్బంది నిఘా నుంచి కుక్క ఎలా తప్పించుకుంది? అనే అంశాలపై విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఒకవైపు కుక్క కలకలం.. మరోవైపు హైజాక్ బెదిరింపు

కోల్‌కతా విమానాశ్రయంలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఇదే ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు రావడం భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సోదెపూర్‌కు చెందిన ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.

విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తన కార్యాలయం తనను ఆఫ్రికా దేశానికి వెళ్లాలని ఒత్తిడి చేస్తోందని, క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్యను వదిలి విదేశాలకు వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని భావించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో హైజాక్ బెదిరింపు నాటకానికి పాల్పడినట్లు వెల్లడైంది. చివరకు ఈ వ్యవహారంలో సదరు ప్రయాణికుడు పోలీసులకు చిక్కి అరెస్టయ్యాడు.

ఒకే విమానాశ్రయంలో వరుసగా చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు విమానాశ్రయ భద్రతా ఏర్పాట్లపై చర్చకు దారితీశాయి.

also read: అమితాబ్ బచ్చన్ ‘జల్సా’కు బాంబు బెదిరింపు.. ముంబైలో హై అలర్ట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు