టాలీవుడ్ సీనియర్ నటుడు, హాస్యనటుడు బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమాలో నటించే అవకాశం ఇస్తామని చెప్పి చివరకు తనను పట్టించుకోలేదని, కనీస మర్యాద కూడా పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, చిత్ర బృందం వ్యవహరించిన తీరుకు కర్మ ఫలితం అనుభవించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబు మోహన్.. ఈ సినిమా కోసం తనను సంప్రదించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్రంలోని ఓ కీలక పాత్రలో నటింపజేయాలని మేకర్స్ తనను సంప్రదించారని తెలిపారు. అందులో భాగంగా తనకు లుక్ టెస్ట్ నిర్వహించడంతో పాటు మేకప్ వేసి, వివిధ రకాల దుస్తులు కూడా ప్రయత్నించారని వెల్లడించారు. ఆ పాత్రకు తానే సరైన వ్యక్తినని చిత్ర బృందం ప్రశంసించిందని చెప్పారు.
షూటింగ్ ప్రారంభమైన సమయంలో తప్పకుండా పిలుస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత తనకు ఎలాంటి సమాచారం అందలేదని బాబు మోహన్ పేర్కొన్నారు. సినిమా విడుదలయ్యే వరకు తనకు పిలుపు వస్తుందని ఎదురుచూసినా, చిత్ర యూనిట్ నుంచి కనీస స్పందన కూడా రాలేదని వాపోయారు.
తనను సినిమాలోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నా ఆ విషయాన్ని నేరుగా చెప్పి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కనీసం ఒక మాట చెప్పకుండా ఇలా వ్యవహరించడం అవమానకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సినిమా ఫలితంపైనా బాబు మోహన్ వ్యాఖ్యలు చేశారు. నిజాం ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో సినిమా ప్రభావం చూపలేదని, కథనం నెమ్మదిగా సాగిందనే విమర్శలు వచ్చాయని పేర్కొన్నారు. పరిశ్రమలో చాలామంది తనను అదృష్టంగా భావిస్తారని, తాను నటించని కొన్ని సినిమాలు గతంలో పరాజయం పాలైన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ అదే జరిగిందని, తనను అవమానించిన వారికి కర్మ ఫలితం దక్కిందని వ్యాఖ్యానించారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విషయంలో బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీశాయి. అయితే ఆయన ఆరోపణలపై ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
also read: శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!
