దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలనే ఆశతో స్వగ్రామానికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కొండాపూర్‌కు చెందిన పల్లపు మహేందర్ (26) గత ఐదేళ్లుగా భారత సైన్యంలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దసరా పండుగ నేపథ్యంలో 25 రోజుల క్రితం సెలవుపై తన స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే విధి నిర్వహణకు తిరిగి వెళ్లాల్సిన సమయంలోనే ప్రమాదం రూపంలో మృత్యువు అతడిని కబళించింది.
సోమవారం మహేందర్ తన బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తుండగా సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో మహేందర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ప్రయాణిస్తున్న రామలింగం కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు.
సమాచారం అందుకున్న స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దేశ రక్షణలో సేవలందిస్తున్న యువ జవాన్ ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహేందర్ మృతితో కొండాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read: హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.. 10 రోజులైనా దొరకని ఆచూకీ.. కొనసాగుతున్న పోలీసుల గాలింపు!
