Homeక్రైమ్స్విమ్మింగ్ పూల్‌లో విద్యుత్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి

స్విమ్మింగ్ పూల్‌లో విద్యుత్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి

క్రైమ్ మిర్రర్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న ఇద్దరు విదేశీయులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కాన్రాడ్ ఫైవ్‌స్టార్ హోటల్ మూడో అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ హోటల్‌లోనే బస చేస్తున్న జర్మనీకి చెందిన 57 ఏళ్ల అలెగ్జాండర్ మాక్సిమిల్లన్ థీసీస్, స్లోవేకియాకు చెందిన 45 ఏళ్ల జురాజ్ హోర్వట్ ఈత కొడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో ఇద్దరూ పూల్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

మృతుల్లో అలెగ్జాండర్ మాక్సిమిల్లన్ థీసీస్ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తుండగా, జురాజ్ హోర్వట్ ఐబీఎం టెక్నాలజీ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

విద్యుత్ షాక్‌కు గురైన వారిని రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వారిలో అమెరికాకు చెందిన మాథ్యూ డిసాంటిస్‌తో పాటు హోటల్ స్విమ్మింగ్ పూల్ అటెండెంట్ రాహుల్ తివారీ ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్‌లో విద్యుత్ సరఫరా ఎలా జరిగింది? భద్రతా ప్రమాణాలు పాటించారా? విద్యుత్ లీకేజీకి కారణాలేమిటి? అనే అంశాలపై విచారణ చేపట్టారు. మరోవైపు హోటల్ యాజమాన్యం నుంచి ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహణ పనుల కారణంగా స్విమ్మింగ్ పూల్‌ను మూసివేయనున్నట్లు హోటల్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. సుమారు 24 అంతస్తులున్న ఈ హోటల్ హిల్టన్ గ్రూప్‌కు చెందినది. ఇంతటి ప్రముఖ హోటల్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ప్రమాదం అతిథుల భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. పోలీసుల దర్యాప్తులో ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
also read : పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి.. నిందితుడు అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు