క్రైమ్ మిర్రర్ : వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిని స్కూల్ వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో పిట్టకాలుబోడు తండా గ్రామపంచాయతీ పరిధిలోని నాజీ తండాలో తీవ్ర విషాదం నెలకొంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం.. నాజీ తండాకు చెందిన బాధావత్ రమేష్, అఖిల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి చిన్న కుమారుడు రాహుల్ (సుమారు మూడేళ్లు) ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో విద్యోదయ హైస్కూల్‌కు చెందిన వ్యాన్ అక్కడికి వచ్చింది. ఈ క్రమంలో బాలుడు వ్యాన్ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయని, తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కళ్లముందే చిన్నారి ప్రమాదానికి గురై మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలతో నాజీ తండాలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ విచారణ చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగింది, వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.
also read: ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్తాపం.. బీటెక్ యువకుడి సూసైడ్
