హన్మకొండ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం మహిళను వేధించిన ఘటన కలకలం రేపుతోంది. దేవుడి పేరుతో నమ్మించే ప్రయత్నం చేయడంతో పాటు, కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. హసన్పర్తి ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న వ్యక్తి తనకు, సదరు మహిళకు గత జన్మలో భార్యాభర్తల సంబంధం ఉందంటూ ఆమెను నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తనతో కలిసి జీవించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఇక్కడితో ఆగకుండా బాధితురాలి ఫొటోలను AI సాయంతో మార్ఫింగ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీవ్రంగా ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సదరు హెచ్ఎంపై కేసు నమోదు చేశారు. AI ద్వారా ఫొటోల మార్ఫింగ్, సోషల్ మీడియాలో వాటి ప్రచారం, మహిళను బెదిరించిన అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యతలో ఉన్న ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంపై ఇలాంటి ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
also read: నకిలీ విద్యార్హత పత్రాలతో ఉద్యోగాలు.. 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు
