Homeతెలంగాణఅక్రమ గుట్కా తయారీ కేంద్రం గుట్టురట్టు.. రూ.50 లక్షల సొత్తు స్వాధీనం

అక్రమ గుట్కా తయారీ కేంద్రం గుట్టురట్టు.. రూ.50 లక్షల సొత్తు స్వాధీనం

క్రైమ్ మిర్రర్ ; నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న గుట్కా, పాన్‌ మసాలా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి భారీగా నిషేధిత ఉత్పత్తులు, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ గోల్కొండ జోన్‌ పోలీసులు, ఆసిఫ్‌నగర్‌ పోలీసులతో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.50 లక్షల విలువైన సొత్తును సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మురాద్‌నగర్‌లో చోటీ మసీదు ఎదురుగా ఉన్న ఓ ఇంటిపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఎలాంటి అనుమతులు, అవసరమైన లైసెన్సులు లేకుండానే అక్కడ గుట్కా, పాన్‌ మసాలా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో బాద్‌షా, సాగర్‌ తదితర బ్రాండ్ల పేర్లను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తయారు చేసిన ప్యాకెట్లపై తప్పనిసరిగా ఉండాల్సిన తయారీ తేదీ, గడువు తేదీ, ఎంఆర్‌పీ, ఆరోగ్య హెచ్చరికలు వంటి వివరాలు సైతం ముద్రించలేదని అధికారులు పేర్కొన్నారు.

దాడి సమయంలో తయారీ కేంద్రంలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్‌కుమార్‌ అలియాస్‌ రోహిత్‌యాదవ్‌ (25), రాజస్థాన్‌కు చెందిన సౌరభ్‌చౌహాన్‌ (20), రాహుల్‌ పర్మార్‌ (21)తో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు గుర్తించారు. మైనర్లను రక్షించి సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ అక్రమ తయారీ వ్యవహారానికి ప్రధానంగా వ్యవహరిస్తున్న జుబేర్‌, భవన యజమాని ముజఫ్ఫర్‌ అలియాస్‌ దాదా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

దాడిలో సుమారు 100 పాన్‌ మసాలా ప్యాకెట్లు, 60 కిలోల విడి జర్దా, కాథా, సుపారీ, సున్నం తదితర ముడిసరుకుతో కూడిన 14 సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2,400 కిలోలకు పైగా గుట్కా మిశ్రమం, బాద్‌షా, జోకర్‌, సాగర్‌ బ్రాండ్ల పేర్లతో ఉన్న ప్యాకింగ్‌ పేపర్‌ రోల్స్‌ను సీజ్‌ చేశారు. గుట్కా తయారీ, ప్యాకింగ్‌కు వినియోగిస్తున్న మూడు ప్యాకింగ్‌ యంత్రాలు, మిక్సింగ్‌ మిషన్‌, ఓవెన్‌, సుపారీ కటింగ్‌ మిషన్‌, ఇతర యంత్రాలు, సీలింగ్‌ పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం లాభాపేక్షతో తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా మైనర్లను ప్రమాదకర పరిస్థితుల్లో పనిలో పెట్టుకోవడంతో పాటు తయారీ కేంద్రం నుంచి వెలువడుతున్న దుర్వాసనతో స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో చైల్డ్‌ లేబర్‌ యాక్ట్‌తో పాటు సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ పర్యవేక్షణలో గోల్కొండ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. మహేష్‌, ఆసిఫ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్. ఆనంద్‌, ఎస్సైలు కె. వెంకట్రామన్‌, ఎన్. నవీన్‌, ఆంజనేయులు, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.
also read : నకిలీ కొడుకుగా నమ్మించి రూ.41 లక్షలకు టోకరా.. వయసు తేడాతో బట్టబయలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు