క్రైమ్ మిర్రర్ : మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పికప్ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి జిల్లా ధామన్‌గావ్ రైల్వే స్టేషన్ సమీపంలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఛానల్ 97 వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. కొందరు భక్తులు నవరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు పికప్ వ్యాన్‌లో ఆలయానికి బయలుదేరారు. బుల్దానా జిల్లాలోని షెగావ్ నుంచి వార్ధా వైపు వెళ్తుండగా వారి వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది.
ట్రక్కు వేగంగా ఢీకొనడంతో పికప్ వ్యాన్ తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మొత్తం 21 మంది గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వాహనంలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి, అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం దామన్‌గావ్ రూరల్ ఆసుపత్రిలో పలువురు చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కు ఢీకొనడానికి దారితీసిన పరిస్థితులు, ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు నివాళులర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
also read : చెరువులో మునిగి నలుగురు బాలికలు మృతి.. బిహార్‌లో విషాదం
