-
కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాలు
-
హైదరాబాదులో ఓ డాక్టర్ ఖాతా నుంచి రూ.14 కోట్లు మాయం చేసిన వైనం
-
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రతిరోజు ఏదో ఒక చోట సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ డెంటల్ వైద్యుడు, వ్యాపారవేత్త అయిన ఓ నలభై నాలుగు సంవత్సరాల డాక్టర్ ఒక వలపు వలకు చిక్కుకున్నాడు.
చదువుతోపాటు వృత్తిలో ఎంతో అనుభవం ఉన్న ఆ వైద్యుడు.. సైబర్ నేరగాళ్లు వేసిన ఒక పక్కా వలపు వలపు చిక్కాడు. ఏకంగా రూ.14.61 కోట్లు పోగొట్టుకున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చరిత్రలోనే వ్యక్తిగతంగా ఒకరు ఇంత భారీ మొత్తంలో మోసపోవడం ఇదే తొలిసారి. అయితే ఈయన ఒక్కరే కాదు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు సైబర్ మోసాల బాధితుల జాబితాలో ఉన్నారు.
-
సోషల్ మీడియాతోనే..
సోషల్ మీడియా పుణ్యమా అని సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా అనేది కాలక్షాపానికే కాదు. కొన్నిసార్లు పాతాళానికి తొక్కేసే మోసానికి ఆయుధంగా మారుతుంది. అందుకు ఈ వైద్యుడి ఘటన నిదర్శనం. ఈ డాక్టర్ గారికి ఫేస్బుక్లో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే మాటల కలయికగా మారింది. మరింత నమ్మకం పెంచింది. అవతలి నుంచి మాయమాటలు చెబుతున్నది ఆడ రూపంలో ఉన్న సైబర్ దొంగలు అని ఆ అమాయక డాక్టర్ గ్రహించలేకపోయారు. ఆ మహిళ ఆయనతో మాట్లాడుతూ ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టింది పెట్టుబడికి కోట్లలో లాభాలు వస్తున్నాయని.. తాను కూడా సంపాదిస్తున్నానని నమ్మబలికింది.
అయితే ఆమె మాయలో పడిపోయిన ఆ డాక్టర్.. ఆమె చూపిన ఒక ఫ్రాడ్ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫారంను గుడ్డిగా నమ్మాడు. ఆమె చెప్పిన మాటలు నిజమే అని నమ్మి.. మొదట్లో కొంత సొమ్ము పెట్టి చూసాడు. ఆ ట్రేడింగ్ యాప్ లో ఆయన పెట్టిన పెట్టుబడికి విపరీతమైన లాభాలు వస్తున్నట్లు గ్రాఫ్ లు చూపించారు.
ఆ డిజిటల్ స్క్రీన్ పై కనిపిస్తున్న నకిలీ లాభాలను చూసి డాక్టర్కు కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంత ఈజీగా డబ్బు సంపాదించవచ్చా? అని ఆశపడి.. తన దగ్గర ఉన్నది కాకుండా అప్పులు చేసి మరి వివిధ లావాదేవీల ద్వారా విడతల వారీగా.. ఏకంగా రూ.14.61 కోట్లు ఆ ఫ్రాడ్ యాప్ లో కుమ్మరించేశాడు.
-
గ్రాఫ్ లాభాలు చూసి..
తన ఖాతాలో కోట్ల రూపాయలు లాభాలు చూపిస్తుండడంతో డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. కానీ ఆ లాభాలను తన బ్యాంకు అకౌంట్ విత్ డ్రా చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే అసలు మాసం బయటపడింది. డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే మరింత టాక్స్ కట్టాలని.. ప్రాసెసింగ్ ఫీజు ఇవ్వాలని సైబర్ నారగాళ్లు కొత్త నాటకాలు మొదలుపెట్టారు.
అప్పుడే డాక్టర్కు అసలు విషయం తెలిసి వచ్చింది. తాను మోసపోయానని గ్రహించి ఆరా తీసేసరికి ఆ కేటుగాళ్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. ఫేస్బుక్లో మాయమాటలు చెప్పిన ఆ అజ్ఞాత మహిళ జాడలేదు. పెట్టిన పెట్టుబడి అసలుకే మోసం వచ్చింది. చివరకు లబోదిబోమంటూ బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీలో బ్యూరో అధికారులను ఆశ్రయించాడు.
-
చదువుకున్న వారే బాధితులు..
సైబర్ మోసాలకు బాధితులు అవుతోంది ఎక్కువగా చదువుకున్నవారే. ఆపై విద్యాధికులే. అటువంటి వారిని ఎంచుకొని మరి బురిడీ కొట్టిస్తున్నారు. సమాజంలో తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలని ఆశపడే వారే ఎక్కువగా బాధితులుగా మిగులుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గత ఆరు నెలల కాలంలో మూడు వేలకు పైగా సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా మోసాలు పెరుగుతున్నా.. రోజురోజుకు బాధితుల సంఖ్య తగ్గకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
