కుటుంబ కలహాలు చివరకు ఓ వ్యక్తి హత్యకు దారితీశాయి. భర్తకు ఉన్న వివాహేతర సంబంధంపై ఆగ్రహం చెందిన భార్య.. తన ఇద్దరు కుమారులతో కలిసి అతడిని హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అనంతరం మృతదేహాన్ని ఓ పెట్టెలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమ్రాబాద్‌కు చెందిన బుర్హానోద్దీన్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అతడి భార్య సఫియాకు, బుర్హానోద్దీన్కు తరచూ గొడవలు జరిగేవి. భర్త తన ప్రవర్తన మార్చుకోవాలని సఫియా పలుమార్లు చెప్పినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని సమాచారం.
తండ్రి వ్యవహారంపై కుమారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించవద్దని, కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయొద్దని వారు తండ్రికి సూచించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని సమాచారం.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సఫియా తన ఇద్దరు కుమారులతో కలిసి బుర్హానోద్దీన్పై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్డుతో అతడి తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు పేర్కొన్నారు.
హత్య అనంతరం మృతదేహాన్ని ఓ పెట్టెలో కుక్కి అక్కడి నుంచి నిందితులు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సఫియాతో పాటు ఆమె ఇద్దరు కుమారులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య.. అసలు కారణమేంటీ ?
