Homeతెలంగాణసీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నల వర్షం.. హామీల అమలుపై తేదీలు చెప్పాలని బహిరంగ లేఖ

సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నల వర్షం.. హామీల అమలుపై తేదీలు చెప్పాలని బహిరంగ లేఖ

సిరిసిల్ల పర్యటనకు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడేళ్లకు సీఎం తొలిసారి సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో.. స్థానిక సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

8 వేల ఎకరాల భూమి వివరాలు వెల్లడించాలి

సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు 8 వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారంటూ గతంలో సీఎం చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించారు. ఇందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పడంపై ఆధారాలు చూపించాలని కోరారు. 2014 నుంచి 2023 మధ్య ఉమ్మడి జిల్లాలో 1,272 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ జరిగిందని, సిరిసిల్ల నియోజకవర్గంలో ఆ సంఖ్య 204 ఎకరాలుగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

8 వేల ఎకరాల భూమి ఎక్కడ ఉందో, స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న 2,400 ఎకరాలు ఏ మండలం, ఏ గ్రామం, ఏ సర్వే నంబర్ పరిధిలో ఉన్నాయో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోతే సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

నేతన్నల బకాయిలపై ప్రశ్నలు

చేనేత రంగానికి సంబంధించిన అంశాలపైనా కేటీఆర్ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు, పాఠశాల యూనిఫాంలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా నేతన్నలకు రూ.3,313 కోట్ల విలువైన పని కల్పించామని పేర్కొన్నారు. దీంతో నేతన్నల ఆదాయం పెరిగిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని నిలిపివేయడంతో పాటు ఇతర ఆర్డర్ల విషయంలోనూ నేతన్నలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని కేటీఆర్ ఆరోపించారు. నేతన్నలకు చెల్లించాల్సిన రూ.60 కోట్ల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. 10 శాతం యార్న్ సబ్సిడీ, రూ.5 లక్షల నేతన్న బీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రైతు హామీలపై నిలదీత

రైతుబంధు మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతామని, కౌలు రైతులకు కూడా రైతుబంధు అందిస్తామని ఇచ్చిన హామీల అమలు ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుబంధు బకాయిల చెల్లింపు, రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి అమలు, రైతుబీమా పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో రూ.1,604 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్ నుంచి అప్పర్ మానేరు ప్రాంతానికి నీటిని తరలించే ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేస్తారో వెల్లడించాలని సీఎం రేవంత్‌ను కోరారు.

విద్య, అభివృద్ధి పనులపై కూడా ప్రశ్నలు

సిరిసిల్లను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేశామని పేర్కొన్న కేటీఆర్.. రూ.400 కోట్లతో మంజూరైన జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సిరిసిల్ల పట్టణంలో గతంలో చేపట్టిన రూ.1,564 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.40 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు.

ఆసరా పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచే హామీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద అందాల్సిన సాయం, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం హామీపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థినులకు స్కూటీలు, ఆటో డ్రైవర్లకు రూ.12 వేల సాయం వంటి హామీల అమలు తేదీలను ప్రకటించాలని అన్నారు.

సంక్షేమ పథకాలపై స్పష్టత కోరిన కేటీఆర్

ముదిరాజ్‌లను బీసీ-ఏ కేటగిరీలో చేర్చే హామీ, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ కార్యక్రమాల పునరుద్ధరణపై కూడా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. దళితబంధు, బీసీబంధు పథకాలను ఎప్పుడు తిరిగి అమలు చేస్తారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు.

సిరిసిల్ల పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. తన బహిరంగ లేఖలో ప్రస్తావించిన అంశాలకు సీఎం సమాధానం చెబితేనే సిరిసిల్ల పర్యటనకు సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు.

also read: మహిళపై లైంగిక దాడికి యత్నించిన క్యాబ్ డ్రైవర్ .. రూ.60 వేల నగదు బ్యాగ్‌తో పరారీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు